HIV Cases: వామ్మో.. ఆ ఒక్క జిల్లాలోనే 7వేలకు పైగా హెచ్ఐవీ కేసులు.. వారిలో 400మంది చిన్నారులు..
నెలకు 40 నుంచి 60 కొత్త ఎయిడ్స్ కేసులు నమోదవుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ జిల్లాలో భారీగా హెచ్ఐవీ కేసులు నమోదవడానికి అనేక..
HIV Cases: బిహార్‌లో ఎయిడ్స్ కలకలం రేగింది. ఆ రాష్ట్రంలో ఒకే జిల్లాలో ఏకంగా 7వేల 400 హెచ్ఐవీ కేసులు నమోదవడం ఆందోళనకు గురి చేస్తోంది. వీరిలో 400 మందికి పైగా చిన్నారులు ఉండటం ఉలిక్కి పడేలా చేసింది.
బిహార్‌లోని సీతామర్హి జిల్లాలో ఎయిడ్స్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. జిల్లా ఆస్పత్రిలోని ఏఆర్‌టీ అధికారిక లెక్కల ప్రకారం.. ఆ జిల్లాలో ఇప్పటివరకు 7వేల 400 మంది హెచ్‌ఐవీ పాజిటివ్ బారిన పడ్డారు. వీరిలో 400 మందికి పైగా చిన్నారులు ఉన్నారు. ఈ పిల్లలకు వారి తల్లిదండ్రుల నుంచే వైరస్ వ్యాప్తి చెందినట్లు వైద్యులు గుర్తించారు. తల్లి, లేదా తండ్రిలో ఎవరో ఒకరు లేదా ఇద్దరూ హెచ్‌ఐవీ పాజిటివ్‌గా ఉండటం వల్ల ప్రసవం సమయంలోనే ఆ పిల్లలకు హెచ్ఐవీ సోకినట్లు వివరించారు.
నెలకు 40 నుంచి 60 కొత్త ఎయిడ్స్ కేసులు నమోదవుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ జిల్లాలో భారీగా హెచ్ఐవీ కేసులు నమోదవడానికి అనేక సామాజిక కారణాలు ఉన్నాయని వైద్యాధికారులు చెబుతున్నారు. హెచ్‌ఐవీపై ప్రజల్లో చాలా తక్కువగా అవగాహన ఉండటం, మెడికల్ టెస్టులు లేకుండానే పెళ్లిళ్లు చేసుకోవడం, ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లడం, సామాజిక వివక్ష కారణంగా ఎయిడ్స్ టెస్ట్‌లు చేయించుకునేందుకు వెనకడుగు వేయడం వంటి అనేక కారణాల వల్ల హెచ్ఐవీ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయని వివరించారు. ”ప్రజల్లో హెచ్‌ఐవీ వ్యాప్తి గురించి సరైన అవగాహన లేదు. ఎయిడ్స్ నియంత్రణకు సంబంధించి ఎన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహించినా, ప్రచారాలు చేసినా ప్రయోజనం లేకుండా పోయింది” అని అధికారులు వాపోయారు.
హెచ్ఐవీ కేసులు భారీగా నమోదవుతుండటంతో అధికారులు అలర్ట్ అయ్యారు. ఎయిడ్స్ అవగాహన కార్యక్రమాలను ముమ్మరం చేయడంపై దృష్టి పెట్టారు. స్థానికంగా ఉన్న గ్రామాల్లో హెచ్‌ఐవీ పరీక్షా కేంద్రాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సురక్షిత లైంగిక పద్ధతులు, కలుషితమైన సూదుల వాడకం వల్ల కలిగే ప్రమాదాలు, క్రమం తప్పకుండా హెచ్‌ఐవీ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరాన్ని ప్రజలకు తెలియజేయనున్నారు.
Also Read: యుద్ధాలు, విపత్తులు, ఇంకా..! అత్యంత భయానకంగా 2026? ఆందోళనకు గురి చేస్తున్న బాబా వంగా జోస్యం..!
