కరోనా చీకట్లు తొలగి…వెలిగిపోతున్న భారత్

కరోనావైరస్(కోవిడ్-19) యొక్క చీకటి” తో పోరాడటానికి సంఘీభావం చూపించే విధంగా ఆదివారం(ఏప్రిల్-5,2020)రాత్రి 9గంటల సమయంలో దేశంలోని అందరూ 9నిమిషాల పాటు కరెంట్ ఆఫ్ చేసి,దీపాలను లేదా కొవ్వొత్తులను వెలిగించాలని లేదా టార్చ్ ను ఆన్ చేయాలని ప్రధాని మోడీ ఇచ్చిన పిలుపుకు విశేష స్పందన లభించింది. దీపం వెలిగించి ఐక్యత చాటింది భారతదేశం.
9గంటల సమయం ఎప్పుడొస్తుందా అని ఉదయం నుంచి ఆసక్తిగా ఎదురుచూసిన దేశ ప్రజలు ఖచ్చితంగా గడియారంలో 9గంటల బెల్ మోగడంతో ఇళ్లల్లోని లైట్ స్విచ్ లు ఆఫ్ చేసి 9నిమిషాల పాటు దీపాలు,కొవ్వొత్తులను వెలిగించారు. దీపాలు,కొవ్వొత్తులు అందుబాటులో లేని వాళ్లు తమ ఫోన్లలోని టార్చ్ ను ఆన్ చేశారు. దీపాల వెలుగులో భారత్ వెలిగిపోయింది.
దీపాల వెలుగుతో కరోనా చీకట్లను తరిమేశారు భారతీయులు. తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా తమ ఇంటి ఆవరణలో 9నిమిషాల పాటు కొవ్వొత్తులు చేతిలో పట్టుకుని నిలబడ్డారు. ఏపీ సీఎం జగన్ కూడా 9నిమిషాల పాటు ఇంటి ఆవరణలో కొవ్వొత్తులు చేతిలో పట్టుకుని నిలబడ్డారు. పలు రాష్ట్రాల సీఎంలు,మంత్రులు,కేంద్రమంత్రులు,పార్టీ నాయకులు,సెలబ్రిటీలు,ప్రముఖులు కూడా తమ ఇంటి వద్ద దీపాలు వెలిగించారు. మరికొందరు కొవ్వొత్తులు వెలిగించారు.
కాగా,అంతకుముందు జనతా కర్ఫ్యూ(మార్చి-22,2020)రోజున కూడా సాయంత్రం 5గంటలకు ప్రతి ఒక్కరూ తమ ఇళ్లల్లో నుంచి గుమ్మం దగ్గరికో లేదా ఆరుబయటకో వచ్చి కరోనాపై రాత్రీపగలు తేడా లేకుండా,తమ ప్రాణాలు కంటే ప్రజల ప్రాణాలే ముఖ్యంగా హాస్పిటల్స్ లో సేవలు అందిస్తున్న వైద్య సిబ్బందికి సంఘీభావంగా చప్పట్లు కొట్టాలన్న మోడీ పిలుపుకు అప్పుడు విశేష స్పందన లభించిన విషయం తెలిసిందే. జనాతా కర్ఫ్యూ రోజు సాయంత్రం 5గంటల సమయంలో దేశప్రజలందరూ వైద్యసిబ్బందకి సంఘీభావంగా కొట్టిన చప్పట్లతో భారత్ మార్మోగిపోయింది. కొన్ని చోట్లా చప్పట్లతో పాటు బెల్స్ కూడా మోగించారు. డ్రమ్స్ కూడా మోగించారు.