Jammu Kashmir Terror Attack: జమ్ముకశ్మీర్ ఉగ్రదాడిలో హైదరాబాద్ వాసి మృతి..
ఉగ్రదాడితో జమ్ముకశ్మీర్ రక్తమోడింది. ఈ మధ్య కాలంలో ఎన్నడూ లేని విధంగా టూరిస్టులపై టెర్రరిస్టులు దాడి చేశారు.

Jammu Kashmir Terror Attack: జమ్ముకశ్మీర్ లో జరిగిన ఉగ్రదాడిలో హైదరాబాద్ వాసి ఒకరు మృతి చెందారు. హైదరాబాద్ కు చెందిన ఐబీ అధికారి ఉగ్రవాదుల కాల్పుల్లో మరణించారు. మృతుడిని ఐబీ అధికారి మనీశ్ రంజన్‌గా గుర్తించారు. మనీశ్ ఇంటెలిజెన్స్ బ్యూరోలో సెక్షన్ ఆఫీసర్‌గా పని చేస్తున్నారు. కుటుంబసభ్యులతో కలిసి పహల్గామ్ పర్యటనకు వెళ్లారు. ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులు జరిపారు. భార్య, పిల్లలను తనకు ఎదురుగా పరిగెత్తమని ఆయన చెప్పారు. ఇంతలోనే బుల్లెట్లు తగిలి మనీశ్ ప్రాణాలు కోల్పోయారు. ఆయన భార్య పిల్లలు సురక్షితంగా బయటపడినట్లు తెలుస్తోంది.
జమ్ముకశ్మీర్ లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. మాటు వేసి పంజా విసిరారు. టూరిస్టులు లక్ష్యంగా మారణం హోమం సృష్టించారు. ఆర్మీ డ్రస్ లో వచ్చి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ముష్కరులు పాతిక మందికిపైగా పర్యాటకులను పొట్టన పెట్టుకున్నారు. పహల్గాం సమీపంలోని బైసరన్ వ్యాలీలో పెద్దఎత్తున టూరిస్టులు ఉన్నారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన ఉగ్రవాదులు కాల్పులు జరిపారు.
ఉగ్రదాడితో జమ్ముకశ్మీర్ రక్తమోడింది. ఈ మధ్య కాలంలో ఎన్నడూ లేని విధంగా టూరిస్టులపై టెర్రరిస్టులు దాడి చేశారు. పహల్ గామ్ లో ఉగ్రవాదులు బరితెగించారు. టూరిస్టులపై కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనతో యావత్ దేశం ఉలిక్కిపడింది. దాదాపు ఆరేళ్ల క్రితం పుల్వామాలో జరిగిన దాడిని గుర్తు చేసేలా ఈ దాడి చేసినట్లు మృతుల సంఖ్యను బట్టి తెలుస్తోంది. ఈ దాడికి పాల్పడింది తామేనంటూ టీఆర్ఎఫ్ గ్రూప్ ప్రకటించింది. ఈ దాడి వెనుక పొరుగు దేశం పాకిస్థాన్ హస్తం కూడా ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది.