I Am MK Stalin : కుమార్తె ఇంట్లో ఐటీ సోదాలపై స్పందించిన డీఎంకే చీఫ్

తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ముందు తీవ్ర కలకలం రేగింది. పోలింగ్‌కు సరిగ్గా 4 రోజుల గడువు మాత్రమే ఉన్న సమయంలో శుక్రవారం(ఏప్రిల్-2,2021) డీఎంకే చీఫ్ ఎమ్.కే స్టాలిన్ కూతురి ఇంటిపై ఐటీ దాడులు జరిగాయి.

I Am MK Stalin : కుమార్తె ఇంట్లో ఐటీ సోదాలపై స్పందించిన డీఎంకే చీఫ్

I Am Mk Stalin Dmk Leaders Message After Tax Raids On Son In Law

Updated On : April 2, 2021 / 10:40 PM IST

I Am MK Stalin తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ముందు తీవ్ర కలకలం రేగింది. పోలింగ్‌కు సరిగ్గా 4 రోజుల గడువు మాత్రమే ఉన్న సమయంలో శుక్రవారం(ఏప్రిల్-2,2021) డీఎంకే చీఫ్ ఎమ్.కే స్టాలిన్ కూతురి ఇంటిపై ఐటీ దాడులు జరిగాయి. చెన్నైలోని నాలుగు చోట్ల ఏకాకాలంలో సోదాలు నిర్వహించారు ఐటీ అధికారులు. ఉదయం 8గంటలకు సోదాలు ప్రారంభమవగా..స్టాలిన్ అల్లుడు శబరీశన్‌తో పాటు అన్నానగర్ డీఎంకే అభ్యర్థి మోహన్ కుమారుడు కార్తీక్ ఇంట్లోనూ,మరో డీఎంకే నాయకుడు బాల ఇంట్లో తనిఖీలు చేశారు.

చెన్నైకి కొద్ది దూరంలో ఉన్న నీలంగరైలోని స్టాలిన్ కుమార్తె సెంథమరై మరియు సబరీసన్ నివాసంలో ఆదాయపన్ను అధికారులు సోదాలు నిర్వహిస్తున్న పెద్ద సంఖ్యలో అక్కడి డీఎంకే మద్దతుదారులు చేరుకొని తమ సంఘీభావం ప్రకటించారు. తమిళనాడు ఎన్నికల్లో డీఎంకే పార్టీకి ఎన్నికల వ్యూహకర్తగా పనిచేస్తున్న ప్రశాంత్ కిశోర్..శబరీషన్ ఇంట్లోనే వ్యూహాత్మక సమావేశాలు నిర్వహిస్తుంటారు. ఈ క్రమంలోనే ఆయన నివాసంలో సోదాలు చేయడం హాట్ టాపిక్‌గా మారింది.

ఆదాయ పన్నుశాఖ సోదాలను డీఎంకే నేతలు ఖండించారు. కేంద్ర సంస్థలను మోడీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని.. రాజకీయ కక్ష సాధింపులోనే భాగంగానే శబరీషన్‌తో పాటు డీఎంకే ఇళ్లపై దాడులు చేస్తున్నారని మండిపడుతున్నారు. తన కుమార్తె ఇంట్లో ఐటీ సోదాలపై డీఎంకే చీఫ్ స్టాలిన్ స్పందిచారు.

పెరంబలూర్‌లో జరిగిన ర్యాలీలో స్టాలిన్ మాట్లాడుతూ…ఈ రోజు ఉదయం నేను చెన్నై నుండి త్రిచికి వచ్చాను. చెన్నైలోని నా కుమార్తె ఇంట్లో దాడి జరుగుతున్నట్లు నాకు వార్తలు వచ్చాయి. మోడీ ప్రభుత్వం ఇప్పుడు ఏఐఏడీఎంకే ప్రభుత్వాన్ని కాపాడుతోంది. నేను ఇప్పుడు మోడీకి చెప్పాలనుకుంటున్నాను.. ఇది డీఎంకే.. అది మర్చిపోవద్దు, నేను కలైగ్నార్ (దివంగత సీఎం ఎం కరుణానిధి) కొడుకు. నేను ఇలా భయపడను. నేను ఎంకే స్టాలిన్. ఈ స్టాలిన్ ఎమర్జెన్సీ మరియు మిసాను ఎదుర్కొన్నాడు. ఈ ఐటీ దాడులకు నేను భయపడను. తన ముందు సాష్టాంగ నమస్కారం చేసే ఏఐఏడీఎంకే నాయకులు లాంటోని నేను కాదని పీఎం మోడీ తెలుసుకోవాలని అన్నారు.

ఇక, తమిళనాడులో ఒకే దశలో ఏప్రిల్ 6న పోలింగ్ జరగనుంది. మరో నాలుగు రోజుల్లో తమిళనాడు భవితవ్యాన్ని అక్కడి ప్రజలు నిర్ణయించబోతున్నారు. 10ఏళ్లుగా అధికారానికి దూరంగా ఉన్న డీఎంకే ఈసారి ఎలాగైనా గెలవాని తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అటు అన్నాడీఎంకే సైతం అధికారాన్ని నిలబెట్టుకునేందుకు కష్టపడుతోంది. మక్కల్ నీది మయ్యం పార్టీ పెట్టిన తర్వాత తొలిసారి ఎన్నికల్లో పోటీచేస్తున్నారు కమల్ హాసన్. ఈ క్రమంలో తమిళనాడు ఎన్నికలపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.