ఓ మైగాడ్.. ఇదెక్కడి బాధ.. కూరగాయల్లో ప్రమాదకర బ్యాక్టీరియా.. దీనివల్ల వచ్చే డేంజర్ ఏంటంటే?

కూరగాయల నుంచి సేకరించిన శాంపిళ్లలో 77రకాల బ్యాక్టీరియా వర్గాలు ఉన్నట్లు పరిశోధకులు నిర్ధారించారు.

ఓ మైగాడ్.. ఇదెక్కడి బాధ.. కూరగాయల్లో ప్రమాదకర బ్యాక్టీరియా.. దీనివల్ల వచ్చే డేంజర్ ఏంటంటే?

Vegetable

Updated On : February 23, 2025 / 10:20 AM IST

Bacterial in Vegetable: ఆరోగ్యంగా ఉండాలంటే ఆకు కూరలు, కూరగాయాలు ఎక్కువగా తీసుకోవాలని వైద్యులు సూచిస్తుంటారు. మనం రోజూ తీసుకునే ఆహారంలో వాటిని ఎక్కువగా తీసుకోవటం వల్ల శరీరానికి విటమిన్లు, ఐరన్, అవసరమైన యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. ఈ విషయం అందరికీ తెలిసిందే..! మీరు కొత్తగా చెప్పేది ఏముంది అనుకుంటున్నారా..? అయితే, మీకో షాకింగ్ న్యూస్. కూరగాయలు తినడం వల్లకూడా ప్రమాదం పొంచిఉందట. ఈ విషయం చెప్పింది ఎవరో కాదు.. ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్). వీళ్లు నిర్వహించిన సర్వేలో ఆకు కూరలు, కూరగాల్లోనూ ప్రమాదకరమైన బ్యాక్టీరియాలు, యాంటీబయాటిక్స్ ఆనవాళ్లు ఉన్నాయట. మన కడుపులో ఉండే ప్రమాదకరమైన ఈకొలి రకం బ్యాక్టీరియాలతో పాటు పలు యాంటీబయాటిక్స్ అవశేషాలూ ఉన్నట్లు వెల్లడైంది.

 

మధ్యప్రదేశ్ లోని ఐసీఎంఆర్ అనుబంధ సంస్థ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఎన్విరాన్మెంట్ హెల్త్, రాజస్థాన్ లోని సెంట్రల్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ లైఫ్ సైన్సెస్, హర్యానాలోని అగ్రికల్చర్ యూనివర్శిటీల సంయుక్తంగా నిర్వహించిన  స్టడీలో ఈ విషయాలన్నీ వెల్లడయ్యాయి. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి 1,780 శాంపిళ్లను వారు సేకరించారు. వాటిలో ఉన్న బ్యాక్టీరియాల ప్రమాద స్థాయి, డ్రగ్ రెసిస్టెన్స్, యాంటీబయాటిక్స్ అవశేషాలపై స్టడీ చేశారు.

 

టమాట, పచ్చిమిర్చి, క్యారెట్, దోస, ముల్లంగి, పాలకూర, మెంతికూర, కొత్తిమీర, పుదీనా, ఉల్లిపోచలు, క్యాబేజీ వంటి వాటిల్లో యాంటీబయాటిక్స్, ఈకొలై బ్యాక్టీరియాల ఆనవాళ్లు ఉన్నట్లు సైంటిస్టులు గుర్తించారు. ఆయా బ్యాక్టీరియాలు ఉన్న కూరగాయలు తినడం వల్ల బ్యాక్టీరియాల డ్రగ్ రెసిస్టెన్స్ ప్రమాదకర స్థాయికి చేరుతుందని సైంటిస్టులు హెచ్చరించారు.

 

కూరగాయల నుంచి సేకరించిన శాంపిళ్లలో 77రకాల బ్యాక్టీరియా వర్గాలు ఉన్నట్లు నిర్ధారించారు. అత్యధికంగా క్యారెట్ 25శాతం కాగా.. క్యాబేజీ 19.3శాతం, మెంతి 18.5శాతం, టమాట 15.9శాతం, కొత్తిమీర 15.7శాతం, పాలకూర 15.2శాతం, పచ్చిమిర్చి 14.5శాతం, దోస 14.4 శాతం, పుదీనా 12శాతం, ఉల్లిపోచ 8.1శాతం బ్యాక్టీరియాల స్ట్రెయిన్స్ ఉన్నాయని సైంటిస్టులు వెల్లడించారు.

 

ఈ బ్యాక్టీరియా స్ట్రెయిన్లు ఉన్న కూరగాయలను తింటే మూత్రనాళ ఇన్ఫెక్షన్లు, బ్లడ్ ఇన్ఫెక్షన్లు వస్తాయని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఎక్కువగా మనుషులు విసర్జించే మలం ద్వారానే అవి కూరగాయల మొక్కల్లోకి చేరుతున్నాయని అంటున్నారు. ఫెస్టిసైడ్స్ ను ఎక్కువగా ఉపయోగించడం వల్ల కూడా యాంటీ బయాటిక్స్ అవశేషాలు కూరగాయల్లోకి చేరుతున్న దాఖలాలు ఉన్నాయని సైంటిస్టులు చెప్పారు.

అంతేకాదు.. చిన్న పిల్లల్లో మెదడు వాపుకు కారణమయ్యే నియోనేటల్ మెనింజైటిస్ ఈకొలై స్ట్రెయిన్స్ కూడా పలు కూరగాయల్లో ఉన్నట్లు హెచ్చరించారు. అయితే, ఈ బ్యాక్టీరియాలు కూరగాయల ద్వారా ఎంతమేర యాంటీ బయాటిక్స్ రెసిస్టెన్స్ సంతరించుకుంటున్నాయన్నదారిపై పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉందని పరిశోధకులు వెల్లడించారు.