Assembly Elections 2023: విజయం సరే.. ఇంతకు సీఎం ఎవరు? విచిత్ర పరిస్థితిలో కాంగ్రెస్!

పైలట్ సహా ఆయన వర్గీయులకు ప్రభుత్వంలో ఎలాంటి ప్రాధాన్యత లేకుండా అడ్డుకున్నారనే వాదనల మధ్య ఉప ముఖ్యమంత్రి పదవిని సచిన్ పైలట్ వదిలేయడం, ఆ తర్వాత కొద్ది రోజులకు ప్రభుత్వం మీదే తిరుగుబాటు చేయడం జరిగిపోయాయి

Assembly Elections 2023: విజయం సరే.. ఇంతకు సీఎం ఎవరు? విచిత్ర పరిస్థితిలో కాంగ్రెస్!

రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆదివారం (డిసెంబర్ 3) విడుదల కానున్నాయి. కాగా, గురువారం సాయంత్రం విడుదలైన ఎగ్జిట్ పోల్ ఫలితాల ప్రకారం అయితే రాష్ట్రంలో హంగ్ ఏర్పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే కొన్ని సర్వేల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంపై కూడా అంచనాలు వేశాయి. మరి ఏమవుతుందనేది ఆదివారం తెలుస్తుంది. ఇదిలా ఉంటే, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి ఎవరన్నది పెద్ద ప్రశ్నగా మారింది.

ప్రస్తుత ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ మధ్య చాలా కాలంగానే ప్రత్యక్ష యుద్ధమే కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే.. ఇద్దరిలో ఎవరు ముఖ్యమంత్రి అవుతారనే చర్చ ఆసక్తికరంగా మారింది. వాస్తవానికి గెహ్లాట్ గతంలో రెండు సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. 2018లో సచిన్ పైలట్ ముఖ్యమంత్రి అభ్యర్థి అంటూ ప్రచారం జరిగినప్పటికీ.. సీనియారిటీ కింద మళ్లీ గెహ్లాటే సీఎం అయ్యారు. అయితే కర్ణాటకలో జరిగిన రెండున్నరేళ్ల సీఎం పంపకం లాంటిది రాజస్థాన్ లో కూడా జరిగిందనే చర్చ సాగింది.
ఇది కూడా చదవండి: లోక్‭సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని దెబ్బకొట్టేందుకు గట్టి ప్లానే వేసిన అఖిలేష్ యాదవ్

కానీ, సచిన్ పైలట్ కు ముఖ్యమంత్రి కుర్చీ ఇచ్చేందుకు ఎంతమాత్రం సముఖంగా లేని గెహ్లాట్.. తానే ముఖ్యమంత్రిగా కొనసాగారు. అంతే కాకుండా, పైలట్ సహా ఆయన వర్గీయులకు ప్రభుత్వంలో ఎలాంటి ప్రాధాన్యత లేకుండా అడ్డుకున్నారనే వాదనల మధ్య ఉప ముఖ్యమంత్రి పదవిని సచిన్ పైలట్ వదిలేయడం, ఆ తర్వాత కొద్ది రోజులకు ప్రభుత్వం మీదే తిరుగుబాటు చేయడం జరిగిపోయాయి. ఆ సమయంలో తన మెజారిటీని గెహ్లాట్ కాపాడుకున్నారు. దీంతో పూర్తి కాలం సీఎంగా ఉండేందుకు ఆయనకు పచ్చ జెండా లభించింది.

అయితే అప్పటి నుంచి సొంత ప్రభుత్వం మీద పైలట్ తీవ్రమైన వ్యతిరేకత చూపిస్తున్నారు. గెహ్లాట్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని, బీజేపీకి సహకరిస్తోందంటూ ఏకంగా నిరాహార దీక్షలే చేపట్టారు. కానీ ఆశించిన ప్రయోజనం రాలేదు. ఇక పైలట్ వర్గమైన గుజ్జర్లు కూడా కాంగ్రెస్ తమకు అన్యాయం చేసిందంటూ విమర్శలు గుప్పించారు. కారణం పైలట్ ను సీఎం చేయకపోవడమే. ఈ నేపథ్యంలో ఈసారి పైలట్ కు అవకాశం లభించొచ్చని అంటున్నారు. కానీ పైలట్ కు సీఎం కుర్చీ రాకుండా ఉండేందుకు ఎంత వరకు వెళ్లడానికైనా గెహ్లాట్ సిద్ధపడుతున్నారు.

ఇది కూడా చదవండి: కాంగ్రెస్‎లో సమర్థవంతమైన నేతలు ఎందరో ఉన్నారు: షర్మిల

ఇందుకోసం కొద్ది రోజుల క్రితం ఏకంగా కాంగ్రెస్ జాతీయ అధ్యక్ష పదవిని సైతం వదులుకున్నారు. అంతే కాకుండా.. సమయం దొరికినప్పుడల్లా సచిన్ పైలట్ మీద తీవ్రమైన పదజాలంతో విరుచుకుపడుతున్నారు. కాంగ్రెస్ నేతల్ని అటువైపు వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. పైగా ఇందిరా సమయం నుంచి గాంధీ కుటుంబానికి అత్యంత విధేయుడిగా గెహ్లాట్ కు పేరుంది. మరి ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధికారం చేపడితే ఇద్దరిలో ఎవరు ముఖ్యమంత్రి అనేది చూడాలి.