Amit Shah: ఇంగ్లీష్‌లో మాట్లాడే వారు సిగ్గుపడే రోజులొస్తాయి, అమిత్‌ షా కీలక వ్యాఖ్యలు

దేశ భాషా వారసత్వాన్ని పునరుద్ధరించే సమయం ఆసన్నమైంది. ఇందుకోసం ప్రయత్నం చేయాలి

Amit Shah: ఇంగ్లీష్‌లో మాట్లాడే వారు సిగ్గుపడే రోజులొస్తాయి, అమిత్‌ షా కీలక వ్యాఖ్యలు

Updated On : June 20, 2025 / 12:04 AM IST

Amit Shah: ఐఏఎస్‌ అధికారి అశుతోశ్ అగ్నిహోత్రి రాసిన పుస్తకావిష్కరణలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇంగ్లీష్ భాషపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంగ్లీష్ లో మాట్లాడే వారు సిగ్గుపడే రోజులొస్తాయని ఆయన అన్నారు. అలాంటి సమాజం ఏర్పడే రోజులు ఎంతో దూరంలో లేవని చెప్పారాయన. మన భాషలే మన సంస్కృతికి రత్నాలన్నారు. భాషలు మనుగడలో లేకుంటే నిజమైన భారతీయులుగా ఉండలేమని చెప్పారు.

‘‘ఈ దేశంలో ఇంగ్లీష్ లో మాట్లాడే వారు సిగ్గుపడే రోజులు వస్తాయి. అటువంటి సమాజం ఏర్పడే రోజులు ఎంతో దూరంలో లేవు. మన దేశ భాషలే మన సంస్కృతికి రత్నాలు. మన భాషలే లేకుంటే మనం నిజమైన భారతీయులుగా ఉండలేం. దేశ భాషా వారసత్వాన్ని పునరుద్ధరించే సమయం ఆసన్నమైంది. ఇందుకోసం ప్రయత్నం చేయాలి’’ అని అమిత్‌ షా పిలుపునిచ్చారు.

భారతీయ భాషలు దేశ గుర్తింపుకు ఆత్మ వంటివి. భారత దేశ భాషా వారసత్వాన్ని తిరిగి పొంది, మాతృభాషల పట్ల గర్వంతో ప్రపంచానికి నాయకత్వం వహించాల్సిన సమయం వచ్చింది. దృఢ సంకల్పం ఉన్న వారు మాత్రమే మార్పు తీసుకురాగలరు. మన దేశ భాషలు మన సంస్కృతికి రత్నాలని నేను నమ్ముతున్నాను’’ అని అమిత్‌ షా అన్నారు.

”మన దేశాన్ని, సంస్కృతిని, మతాన్ని అర్థం చేసుకునేందుకు ఏ పరాయి భాష సరిపోదు. విదేశీ భాషలతో సంపూర్ణ భారతీయ భావనను ఊహించుకోలేము. ఇది ఎంత కష్టమో నాకు తెలుసు. అయినప్పటికీ ఇందులో భారత సమాజం విజయం సాధిస్తుందన్న విశ్వాసం ఉంది” అని అమిత్ షా అన్నారు.

ప్రధాని మోదీ రూపొందించిన ‘పంచ ప్రాణ్’ (ఐదు ప్రతిజ్ఞలు) గురించి అమిత్ షా వివరించారు. ఈ ఐదు ప్రతిజ్ఞలు దేశంలోని 130 కోట్ల మంది ప్రజల సంకల్పంగా మారాయని చెప్పారు. 2047 నాటికి మనం శిఖరాగ్రంలో ఉంటాము, ఈ ప్రయాణంలో మన భాషలు ప్రధాన పాత్ర పోషిస్తాయి” అని అమిత్ షా చెప్పారు.