బ్రిటీష్ పార్లమెంట్లో “వ్యవసాయ చట్టాలపై” చర్చ..బ్రిటన్ రాయబారికి భారత్ సమన్లు

India Conveys Strong Objection To British Envoy Over Farm Laws Discussion మోడీ సర్కార్ తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా భారత్‌లో జరుగుతున్న రైతు నిరసనలు మరియు పత్రికా స్వేచ్ఛ అంశాలపై సోమవారం బ్రిటన్ పార్లమెంట్‌లో చర్చ చేపట్టారు. 90నిమిషాల పాటు ఈ అంశాలపై బ్రిటన్ పార్లమెంట్ లో చర్చ జరగింది. భారత సంతతికి చెందిన లిబరల్ డెమోక్రాట్ నేత గుర్చ్ సింగ్ వేసిన పిటిషన్ ఆధారంగా బ్రిటన్ పార్లమెంట్‌లో చర్చ చేపట్టారు. ఆ పిటిషన్‌పై బ్రిటన్‌లో ఉన్న స్థానికుల నుంచి లక్షల సంఖ్యలో సంతకాలు సేకరించారు. రైతుల నిరసనల పట్ల మోడీ ప్రభుత్వం వ్యవహరించిన తీరును చర్చ సమయంలో లేబర్ పార్టీ,లిబరల్ డెమోక్రాట్స్,స్కాటిష్ నేషనల్ పార్టీ ఎంపీలు ఖండించారు.
రైతు సంస్కరణలు భారత ప్రభుత్వ నిర్ణయాలని, ఆ సంస్కరణల గురించి తాము చర్చించడం లేదని, కేవలం నిరసనకారుల రక్షణ గురించి ,మీడియా స్వేచ్ఛ గురించి మాత్రమే చర్చిస్తున్నామని స్కాటిష్ నేషనల్ పార్టీ ఎంపీ మార్టిన్ డే బ్రిటన్ పార్లమెంట్ లో మాట్లాడారు. రైతు నిరసనకారులపై టియర్ గ్యాస్ ప్రయోగించారని, పలు చోట్ల ఘర్షణలు చోటుచేసుకున్నాయని, ఇంటర్నెట్ కనక్టివిటీ దెబ్బతిన్నట్లు ఆయన చెప్పారు. లేబర్ పార్టీ నేత జెర్మీ కార్బిన్ మాట్లాడుతూ.. ఎందుకు రైతులు అంత పెద్ద సంఖ్యలో నిరసనలు చేపడుతున్నారో ఆలోచించాలన్నారు. జర్నలిస్టుల అరెస్టు ఆందోళన కలిగిస్తున్నదన్నారు. బ్రిటన్‌లోనూ నిరసనలు జరిగినప్పుడు పోలీసులకు వ్యతిరేకంగా ఫిర్యాదులు అందుతుంటాయని, అంటే దాని అర్థం ప్రజాస్వామ్యానికి బ్రిటన్ వ్యతిరేకం కాదు అని కన్జర్వేటివ్ ఎంపీ థెరిసా విల్లియర్స్ తెలిపారు. మరోపక్క ఇదే చర్చలో కొంతమంది ఎంపీలు భారత ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడారు.
అయితే, బ్రిటన్ పార్లమెంట్ లో భారత వ్యవసాయ చట్టాలపై చర్చ జరగడాన్ని భారత విదేశాంగశాఖ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.బ్రిటన్ పార్లమెంట్ లో సోమవారం భారత చట్టాలపై జరిగిన చర్చపై తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేసింది. వేరొక ప్రజాస్వామ్య దేశంలోని రాజకీయాల్లో పూర్తిగా జ్యోకం చేసుకోవడంగానే దీన్ని భావిస్తున్నామని భారత్ తేల్చిచెప్పినట్లు విదేశాంగశాఖ తెలిపింది. తోటి ప్రజాస్వామ్య దేశానికి సంబంధించిన అంశాలను తప్పుగా చూపించి..ఓటు బ్యాంకు రాజకీయాలు చేయవద్దని బ్రిటిష్ ఎంపీలకు సూచించింది భారత విదేశాంగ శాఖ. ఈ విషయమై భారత్ లోని బ్రిటీష్ హై కమిషనర్ ను తమ ముందు హాజరుకావాలని ఇవాళ సమన్లు జారీచేసింది.
మరోవైపు, బ్రిటన్ పార్లమెంట్‌లో రైతు చట్టాలపై చర్చ జరగడాన్ని లండన్ లోని భారత హైకమిషన్ తప్పుపట్టింది. ఈమేరకు హై కమిషన్ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో..వాస్తవాలు తెలియకుండా చర్చలు చేపట్టడం ఏమాత్రం సరికాదని బ్రిటన్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. చర్చలు సమతుల్యంగా జరగాలని, వాస్తవాలు తెలియకుండా ఎటువంటి వాదనలకు దిగకూడదని . ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంపై అనుచిత ఆరోపణలు చేస్తున్నారని, భారత వ్యవస్థలను తప్పుగా చిత్రీకరిస్తున్నారని హై కమీషన్ తన లేఖలో పేర్కొంది. విదేశీ మీడియాతో పాటు బ్రిటీష్ మీడియా కూడా భారత్ లో ఉందని, భారత్‌లో పత్రికా స్వేచ్ఛ లేదన్న అంశం ఏ రకంగా ఉత్పన్నంకాదు అని భారతీయ హై కమీషన్ తన ప్రకటనలో స్పష్టం చేసింది.