జాగ్రత్తగా వాడుకోండి: దేశంలో గ్యాస్ కొరత.. ఇబ్బందులు తప్పవు

  • Published By: vamsi ,Published On : September 28, 2019 / 02:50 AM IST
జాగ్రత్తగా వాడుకోండి: దేశంలో గ్యాస్ కొరత.. ఇబ్బందులు తప్పవు

Updated On : September 28, 2019 / 2:50 AM IST

భారత్ లో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ కొరత ఏర్పడిందా? ఇది తీవ్రతరం కాబోతుందా? గ్యాస్ లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి వస్తుందా? అవుననే సంకేతాలు కనిపిస్తున్నాయి దేశంలో. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో ఈ పరిస్థితి వచ్చేయగా తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ పరిస్థితి ఏర్పడే అవకాశం ఉందని అంటున్నారు అధికారులు.

సౌదీలో ఆయిల్ బావులపై డ్రోన్ దాడులు ఈ కొరతకు కారణంగా తెలుస్తుంది. ప్రతి నెలా సౌదీ నుంచి 2లక్షల టన్నుల ఎల్పీజీని కొలుగోలు చేస్తోంది. అయితే, సౌదీలోని అరామ్కో ఆయిల్ రిఫైనరీపై హౌతీ తిరుగుబాటుదారులు డ్రోన్ దాడులు చేశారు. దీంతో అబక్ అండ్ ఖురాయిస్‌లో ఉన్న క్రూడ్ ఆయిల్ బావులు దెబ్బతినగా.. ఉత్పత్తి సగానికి తగ్గిపోయింది.

ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో బుక్ చేసుకున్న 15 రోజుల వరకు సిలిండర్ అందట్లేదు. ముఖ్యంగా మహారాష్ట్ర, కర్ణాటక, పంజాబ్, గోవా రాష్ట్రాల్లో ఎల్పీజీ కొరత తీవ్రంగా ఉంది. మహారాష్ట్రలో అక్టోబరు 21వ తేదీ నుంచి అసెంబ్లీ ఎన్నికలు ఉండగా ఎల్పీజీ కొరత ఏర్పడటం అక్కడి అధికార బీజేపీ పార్టీని ఇబ్బంది పెడుతుంది.

ఈ క్రమంలో అక్కడ కొరత లేకుండా చేయాలని కేంద్రం భావిస్తుంది. ఈ క్రమంలోనే మరో రెండు కార్గోలు అదనంగా పంపాలని కేంద్ర ప్రభుత్వం అబుదాబి నేషల్ ఆయిల్ కంపెనీకి లేఖలు కూడా రాసింది. అయితే, అవి భారత్‌కు చేరేందుకు ఇంకా 10 రోజులు పట్టవచ్చు.