India e-Visa: అప్ఘాన్ నుంచి భారత్‌కు వచ్చే అందరికీ ఈ-వీసా తప్పనిసరి
అఫ్ఘానిస్తాన్ నుంచి వచ్చేవారందరికి ఈ-వీసా( e-Visa)లను తప్పనిసరి చేసింది భారత ప్రభుత్వం. ఈ మేరకు కేంద్ర హోంశాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది.

India Makes E Visa Mandatory For Afghan Nationals
e-Visa mandatory for Afghan nationals : అఫ్ఘానిస్తాన్ నుంచి వచ్చేవారందరికి ఈ-వీసా( e-Visa)లను తప్పనిసరి చేసింది భారత ప్రభుత్వం. ఈ మేరకు కేంద్ర హోంశాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఆగస్టు 25న తాలిబన్లు అప్ఘానిస్తాన్‌ను ఆక్రమణతో అక్కడి అప్ఘాన్ జాతీయులందరూ విదేశాలకు వెళ్లిపోతున్నారు. ఈ క్రమంలో అక్కడి పరిస్థితి దృష్ట్యా కేంద్రం ప్రభుత్వం.. భారత్‌కు వచ్చే అప్ఘాన్ జాతీయులంతా తప్పనిసరిగా ఈ-వీసాలపైనే ప్రయాణించాల్సిందిగా నిర్ణయించింది. గతంలో అప్ఘాన్ జాతీయులందరికి జారీ చేసిన పాత వీసాలన్నింటినీ రద్దు చేసినట్టు ప్రకటించింది. అఫ్ఘాన్ జాతీయుల పాస్‌పోర్ట్‌లు గల్లంతయ్యాయి అనే వార్తల నేపథ్యంలో భారత ప్రభుత్వం ఈ దిశగా నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం భారత్ లో ఉన్న అప్ఘాన్ జాతీయుల పాత వీసాలు కూడా చెల్లుబాటు కావని తెలిపింది. అప్ఘాన్ నుంచి భారత్ కు రావాలనుకునే అప్ఘాన్లు వీసా కోసం దరఖాస్తు చేసుకోవడానికి అధికారిక పోర్టల్‌ను విజిట్ చేయాలని సూచించింది.
ఆఫ్ఘన్ జాతీయులు ఈ-వీసాల కోసం www.indianvisaonline.gov.in పోర్టల్‌లో అప్లయ్ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. భారత్ కు వచ్చే అప్ఘాన్ జాతీయుల వీసా అప్లికేషన్ల ధ్రువీకరణను వేగవంతం చేయాలని ప్రభుత్వం భావించింది. అందులోభాగంగానే ఈ నెల మొదటి వారంలో కొత్త ఈ-వీసాలను జారీ చేయాలనుకుంది. అప్ఘాన్ జాతీయులందరి కోసం కొత్తగా e-Emergency X-Misc Visa జారీ చేయనున్నట్టు వెల్లడించింది. ఈ-వీసాలపై మాత్రమే అప్ఘాన్లు భారత్ కు రావాల్సి ఉంటుందని కేంద్ర హోంశాఖ పేర్కొంది.
అఫ్ఘానిస్తాన్‌లో తాలిబాన్లు అధికారం చేజిక్కించుకున్న రెండు రోజుల తర్వాత ఈ ప్రకటన వచ్చింది. అఫ్ఘానిస్తాన్ రాజధాని కాబూల్ నగరాన్ని తాలిబాన్ స్వాధీనం చేసుకున్న ఒక రోజు తర్వాత ఆగస్టు 16న కాబూల్ నుంచి ఢిల్లీకి 40 మంది భారతీయులను విమానంలో తరలించింది. ఇప్పటివరకు, కాబూల్‌లో భద్రతా పరిస్థితి దృష్ట్యా అక్కడి పౌరులను 800 మందికి పైగా మందిని సురక్షిత ప్రాంతాలకు భారత్ తరలించింది. తాలిబాన్ల క్రూరత్వానికి భయపడి దేశం విడిచి పారిపోవాలని ప్రయత్నిస్తూ, వేలాది మంది అఫ్ఘానిస్తాన్ నుంచి కాబూల్ విమానాశ్రయానికి తరలివస్తున్నారు. కాబూల్ నుంచి భారతీయులు, ఆఫ్ఘన్ భాగస్వాములను తరలించేందుకు భారత్ ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఆగస్టు 24న, కాబుల్ నుంచి తాజిక్ నగరానికి తరలించింది. దుషాన్‌బే నుంచి 25 మంది అప్ఘాన్ జాతీయులు, అనేక మంది అఫ్ఘాన్ సిక్కులు, హిందువులతో సహా 78 మందిని భారత్ తరలించింది.