India on China Law : మనకు ఆందోళనకరమే..చైనా భూ సరిహద్దు చట్టంపై స్పందించిన భారత్

గతవారం చైనా ఆమోదించిన నూతన భూ సరిహద్దు చట్టంపై ఇవాళ భారత్ స్పందించింది. చైనా తాజా చట్టం..ద్వైపాక్షిక సంబంధాలపైనా,సరిహద్దు నిర్వహణకు సంబంధించిన ప్రస్తుత

India on China Law : మనకు ఆందోళనకరమే..చైనా భూ సరిహద్దు చట్టంపై స్పందించిన భారత్

India China

Updated On : October 27, 2021 / 5:00 PM IST

India on China Law గతవారం చైనా ఆమోదించిన నూతన భూ సరిహద్దు చట్టంపై ఇవాళ భారత్ స్పందించింది. చైనా తాజా చట్టం..ద్వైపాక్షిక సంబంధాలపైనా,సరిహద్దు నిర్వహణకు సంబంధించిన ప్రస్తుత ద్వైపాక్షిక ఒప్పందాలపైనా ప్రభావం చూపే అవకాశం ఉందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ బుధవారం తెలిపింది. ఇరు దేశాల మధ్య సరిహద్దు వివాదం అపరిష్కృతంగా ఉండటం భారత్‌కు ఆందోళనకరమని బుధవారం విడుదల చేసిన ప్రకటనలో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి పేర్కొన్నారు.

అయితే చైనా తీసుకున్న ఇటువంటి ఏక పక్ష చర్యల ప్రభావం ఇప్పటికే ఇరు దేశాల మధ్య కుదిరిన ఒప్పందాలపై ఉండబోదని తెలిపారు. ఇరు దేశాల మధ్య సరిహద్దు వివాదంపైన అయినా, వాస్తవాధీన రేఖ (LAC) వెంబడి ప్రశాంతత, శాంతి, సామరస్యాల నిర్వహణపైన అయినా ఈ కొత్త చట్టం ప్రభావం ఉండబోదన్నారు. భారత దేశం దృష్టిలో 1963 నాటి చైనా-పాకిస్థాన్ సరిహద్దు ఒప్పందం అని చెప్పుకుంటున్న ఒప్పందానికి ఈ కొత్త చట్టం ఎటువంటి చట్టబద్ధతను కల్పించదని తెలిపారు. 1963నాటి ఒప్పందం చట్టవిరుద్ధమని, చెల్లనిదని భారత దేశం నిరంతరం చెప్తోందని పేర్కొన్నారు.

కాగా, చైనా కొత్త చట్టం తమ భూభాగాన్ని రక్షించడానికి, చైనా భూభాగాలపై విదేశాల అభ్యంతరాలను చర్యలను ఎదుర్కోవడానికి ప్రభుత్వం, మిలిటరీకి అవకాశం కల్పించేలా రూపొందించింది. ఈ చట్టం ప్రకారం భూమి సరిహద్దు వ్యవహారాలపై ఇతర దేశాలతో సంయుక్తంగా కుదుర్చుకున్న, పూర్తయిన ఒప్పందాలకు చైనా కట్టుబడి ఉంటుంది. చైనా సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రత అత్యంత పవిత్రమైనవి, అనుల్లంఘనీయమైనవి అని ఈ చట్టం చెబుతోంది.

ప్రాదేశిక సమగ్రత,సార్వభౌమాధికారం, భూ సరిహద్దులకు విఘాతం కలిగించే ఎటువంటి పనులనైనా అడ్డుకునేందుకు చైనా ఎలాంటి చర్యలైనా చేపడుతుందని చట్టంలో పేర్కొంది. సమానత్వం, పరస్పర విశ్వాసం, స్నేహపూర్వక సంప్రదింపులు అనే సూత్రాల ద్వారా సరిహద్దు వ్యవహారాలను నిర్వహించనున్నట్లు చట్టంలో పేర్కొన్నారు. చర్చలతోనే పొరుగు దేశాలతో వివాదాలను పరిష్కరించుకుంటామని వివరించారు.

సరిహద్దుల్లో ప్రజలు నివసించేలా, పని చేసుకునేలా ప్రోత్సహించనున్నట్లు ఈ కొత్త సరిహద్దు చట్టం వెల్లడించింది. సరిహద్దుల్లో రక్షణను పటిష్టపరచాలని, సాంఘిక, ఆర్థికాభివృద్ధి కోసం చర్యలు తీసుకోవాలని పేర్కొంది. సరిహద్దు ప్రాంతాలను తెరవడం, ప్రభుత్వ సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, సరిహద్దు ప్రాంతాల్లోని ప్రజల జీవితం, జీవనోపాధి కోసం కూడా చర్యలు తీసుకోవాలని తెలిపింది.

ALSO READ Professor Posts : హిమాచల్ ప్రదేశ్ సెంట్రల్ యూనివర్శిటీలో ప్రొఫెసర్ పోస్టుల భర్తీ