World Press Freedom Index : పత్రికా స్వేచ్ఛలో 150వ స్థానానికి పడిపోయిన భారత్
పత్రికా స్వేచ్ఛ సూచికలో 2021లో 142వ స్థానంలో ఉన్న భారత్ మరింత దిగజారింది. 150వ స్థానానికి పడిపోయింది అని వరల్డ్ ఫ్రీడమ్ ఇండెక్స్ వెల్లడించింది.

World Press Freedom Index India Slips To 150th Rank
World Press Freedom Index India Slips To 150th Rank: భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అనే పేరు ఉంది. కానీ ఇక్కడ స్వేచ్ఛ ఎంత? అంటే కాస్త ఆలోచించాల్సిందేనేమో? ఎందుకంటే పత్రికా స్వేచ్ఛలోనే 150వ స్థానానికి పడిపోయిన భారత్ లో స్వేఛ్ఛ అనేదానికి అర్థం లేదేమో?! అనిపిస్తోంది. ఇదంతా ఎందుకు అంటే..భారత్‌లో పత్రికా స్వేచ్ఛ సంక్షోభంలో పడిందని వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ వ్యాఖ్యానించింది. అంతేకాదు పత్రికా స్వేచ్ఛకు అత్యంత ప్రమాదం ఉన్న దేశాల్లో భారత్ కూడా ఒకటని పేర్కొంది వరల్డ్ ఫ్రీడమ్ ఇండెక్స్.
పత్రికా స్వేచ్ఛ సూచికలో 2021లో 142వ స్థానంలో ఉన్న భారత్ మరింత దిగజారింది. 150వ స్థానానికి పడిపోయింది అని వరల్డ్ ఫ్రీడమ్ ఇండెక్స్ వెల్లడించింది. ఈ స్వేఛ్చ ఎంతగా దిగజారిపోయింది అంటే వార్తలు అందించే జర్నలిస్టుల ప్రాణాలకు కూడా ప్రమాదంవాటిల్లేంత. ఇంకా చెప్పాలంటే జర్నలిస్టుల ప్రాణాలు పోయేంత ప్రమాదంలో ఉంది అని పేర్కొంది.విధి నిర్వహణలో ఏడాదికి ముగ్గురు లేదా నలుగురు పాత్రికేయులు ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపింది. ఈ సూచీలో 2016 నుంచి భారత్ స్థానం దిగజారుతూనే వస్తోందని పేర్కొంది.
భారత్‌లో లక్షకు పైగా వార్తా పత్రికలతోపాటు 36 వేల వార పత్రికలు, 380 టీవీ న్యూస్ చానళ్లు ఉన్నాయని నివేదికలో పేర్కొంది. ప్రపంచ వ్యాప్తంగా 180 దేశాలు, ప్రాంతాల్లో పత్రికా స్వేచ్ఛ తీరుతెన్నులను తెలిపే వరల్డ్ ప్రెస్ ఫ్రీడం ఇండెక్స్–2022 ఎడిషన్, వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే అయిన 3న విడుదలైంది.