సర్జికల్ స్ట్రయిక్ : ఫిబ్రవరి 15నే ప్లేస్, డేట్, టైమ్ ఫిక్స్

ఢిల్లీ: పాకిస్తాన్ లోని ఉగ్రవాద శిబిరాలపై భారత వాయుసేన మెరుపు దాడులు చేసి బాంబులు వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. ఉగ్రవాదుల శిబిరాలను ధ్వంసం చేయడంతో పాటు 245మంది టెర్రరిస్టులను మట్టుబెట్టింది. అలా పుల్వామా దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. మరి.. ఈ మెరుపు దాడులను ముందే ప్లాన్ చేశారా. ప్లేస్, డేట్, టైమ్‌ని ముందే ఫిక్స్ చేశారా.. అంటే అవుననే సమాధానం వస్తోంది.
2019, ఫిబ్రవరి 14న పుల్వామాలో ఉగ్రదాడి జరిగిన వెంటనే భారత్ ప్రతీకారానికి వ్యూహం రచించింది. దాడులకు సంబంధించిన బ్లూ ప్రింట్ ను కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 15న సిద్ధం చేసింది. దాడి తీరుపై అదే రోజు రక్షణమంత్రికి ఎయిర్ చీఫ్ వివరించారు. ఫిబ్రవరి 20 నుంచి 21 వ తేదీ వరకు దాడి చేసే స్థావరాలను ఎంపిక చేశారు. ఫిబ్రవరి 24న భారత వాయుసేన ట్రయల్ రన్ నిర్వహించింది.
అందులో భాగంగా ఫిబ్రవరి 26 మంగళవారం తెల్లవారుజామున సరిహద్దు దాటి 3 ప్రాంతాల్లో భారత వైమానిక దళాలు దాడులు చేశాయి. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌లో ఉగ్రవాద శిబిరాలపై మెరుపు దాడులు నిర్వహించాయి. దాడులకు హెరాన్ నిఘా డ్రోన్ ను ఉపయోగించాయి. 12 మిరాజ్ జెట్స్ తో వెయ్యి కిలోల పేలుడు పదార్థాలతో జైష్-ఏ-మహ్మద్ ఉగ్రవాద శిబిరాలే లక్ష్యంగా అటాక్స్ జరిపారు. 21 నిమిషాల్లో 3 ప్రాంతాల్లో భారత వైమానిక దళం దాడులు చేసింది. తెల్లవారుజామున 3.45 నుంచి 3.53 గంటల వరకు బాల్ కోట్ ప్రాంతంలో ఫస్ట్ అటాక్ చేసింది. ఉ.3.48 నుంచి 3.55 గంటల వరకు ముజఫరాబాద్ లో సెకండ్ అటాక్.. 3.58 నుంచి 4.04 వరకు చకోటిలోని ఉగ్రవాద శిబిరాలపై థర్ట్ అటాక్ చేసింది. ఉగ్రవాద శిబిరాల్లో తలదాచుకుంటున్న 245మంది టెర్రరిస్టులు హతం అయ్యారు.
వైమానిక దాడుల్లో 12 మిరాజ్ 2000 యుద్ధ విమానాలు పాల్గొన్నాయి. 28 మంది పైలట్లు ఈ ఆపరేషన్ లో భాగంగా పాక్ భూభాగంలోకి ప్రవేశించారు. వెయ్యి కేజీల బాంబులను ఉగ్రవాద శిబిరాలు టార్గెట్ గా పేల్చారు. శాటిలైట్ ఆధారంగా లైన్ ఆఫ్ కంట్రోల్ లో ఉన్న ఉగ్రవాద శిబిరాలను గుర్తించి.. గురిచూసి బాంబులు వదిలారు. వెయ్యి కేజీల బాంబులతో లైన్ ఆఫ్ కంట్రోల్ దద్ధరిల్లింది. ఉగ్రవాద శిబిరాలుగా అనుమానిస్తున్న అన్నీ పూర్తిగా ధ్వంసం అయ్యాయి. ఈ ఆపరేషన్ పూర్తిగా విజయవంతమైనట్లు భారత్ ఆర్మీ ప్రకటించింది.