ఇండియన్ రైల్వే ఆఫర్ : ప్లాస్టిక్ బాటిల్ క్రషర్లు వాడండి.. మొబైల్ రీఛార్జ్ చేసుకోండి!

  • Published By: sreehari ,Published On : September 11, 2019 / 09:59 AM IST
ఇండియన్ రైల్వే ఆఫర్ : ప్లాస్టిక్ బాటిల్ క్రషర్లు వాడండి.. మొబైల్ రీఛార్జ్ చేసుకోండి!

Updated On : September 11, 2019 / 9:59 AM IST

ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిర్మూలించాలని ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేరకు భారత రైల్వే శాఖ కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. పియూష్ గోయెల్ అధ్యక్షతన రైల్వే మంత్రిత్వ శాఖ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిర్మూలన దిశగా అడుగులు వేసింది. రైల్వే ప్రయాణికులకు ప్లాస్టిక్ బాటిల్స్ నియంత్రణపై అవగాహన కల్పించే దిశగా చర్యలు చేపట్టింది. రైల్వే స్టేషన్లలో ప్లాస్టిక్ బాటిల్ క్రషర్ మిషన్లను దేశవ్యాప్తంగా ఏర్పాటు చేస్తోంది.

రైల్వే ప్రయాణికులు సింగిల్ యూజ్ తో ఎవరైతే వాడిన ప్లాస్టిక్ బాటిల్స్ క్రషర్ మిషన్లలో వేస్తారో వారి మొబైల్ రీఛార్జ్ చేయించుకోనే అవకాశం ఇస్తోంది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని మోడీ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పై దేశప్రజలకు సందేశం ఇచ్చారు. ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ కు బదులుగా ప్రత్యామ్నాయాలను అనుసరించాలని మోడీ ప్రజలను కోరారు. 2019 ఏడాదిలో అక్టోబర్ 2 నుంచి అన్ని రైల్వే స్టేషన్లలో ప్లాస్టిక్ బాటిల్ క్రషర్ మిషన్లను ప్రారంభించాలని రైల్వే మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది.

రైల్వే స్టేషన్ల పరిసర ప్రాంతాల్లో ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నియంత్రించాలని సూచించింది. రైల్వే స్టేషన్లలో 400 వరకు బాటిల్ క్రషింగ్ మిషన్లను ఇన్ స్టాల్ చేయనున్నట్టు రైల్వే బోర్డు చైర్మన్ వికె యాదవ్ ఒక రిపోర్టులో తెలిపారు. ప్యాసింజర్లు తాము వాడిన వాటర్ బాటిళ్లను క్రషింగ్ మిషన్లలో వేసేలా ప్రోత్సహించనున్నారు. మిషన్లలో వాటర్ బాటిళ్లు వేసే ముందు ప్రతి ప్రయాణికుడు తమ ఫోన్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. వెంటనే వారి ఫోన్ నెంబర్ కు రీఛార్జ్ అవుతుంది.

ప్రస్తుతం 128 రైల్వే స్టేషన్లలో మొత్తం 160 బాటిల్ క్రషింగ్ మిషన్లు అందుబాటులో ఉన్నట్టు యాదవ్ తెలిపారు. భారత రైల్వే ఉద్యోగులకు కూడా పలు సూచనలు చేసినట్టు తెలిపారు. రైల్వే స్టేషన్లలో ప్రయాణికులు వాడి పడేసిన ప్లాస్టిక్ బాటిళ్లను సేకరించి రీసైక్లింగ్ కు పంపాలని సూచలను చేశారు. రైల్వే ఉద్యోగులు, వెండర్లను ప్లాస్టిక్ బదులుగా తిరిగి వాడే బ్యాగులను వాడాల్సిందిగా రైల్వే మంత్రిత్వ శాఖ సూచించినట్టు రిపోర్టు తెలిపింది.