Online Reception: కొత్త జంటకు ఇండిగో తిప్పలు.. ఆ వేడుకను ఆన్‌లైన్‌లోనే కానిచ్చేశారుగా.. వీడియో వైరల్..

కర్నాటకలో రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు హాజరయ్యేందుకు నవ దంపతులు ఇండిగో విమానంలో టికెట్లు బుక్ చేసుకున్నారు.

Online Reception: కొత్త జంటకు ఇండిగో తిప్పలు.. ఆ వేడుకను ఆన్‌లైన్‌లోనే కానిచ్చేశారుగా.. వీడియో వైరల్..

Updated On : December 5, 2025 / 5:02 PM IST

Online Reception: దేశవ్యాప్తంగా ఇండిగో విమాన సర్వీసుల రద్దు కొనసాగుతుండటంతో వేలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముందే జర్నీలు ప్లాన్ చేసుకున్నా.. సడెన్ గా ఇండిగో సర్వీసులు నిలిచిపోవడంతో ప్రయాణికులు అష్టకష్టాలు పడుతున్నారు. చివరి నిమిషంలో జర్నీ క్యాన్సిల్ అని తెలిసి తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రయాణాలు రద్దు కావడంతో ఏం చేయాలో అర్థం కాక దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. ఇదిలా ఉంటే.. ఇండిగో సంక్షోభం.. ఓ కొత్త జంటను తాకింది. కొత్తగా పెళ్లి చేసుకున్న ఆ జంట.. తమ వెడ్డింగ్ రిసెప్షన్ కు హాజరు కాలేకపోయింది. ఇండిగో విమాన సర్వీసులు రద్దు కావడమే ఇందుకు కారణం.

ఇండిగో సంక్షోభం వేళ.. ఓ టెకీ దంపతులకు వింత అనుభం ఎదురైంది. ఇటీవలే పెళ్లి చేసుకున్న ఈ దంపతులు ఆన్ లైన్ లో రిసెప్షన్ చేసుకోవాల్సిన పరిస్థితి ఎదురైంది. కర్నాటకలోని హుబ్బళికి చెందిన మేధా క్షీరసాగర్, భువనేశ్వర్ కు చెందిన సంగం దాస్ లు బెంగళూరులో సాఫ్ట్ వేర్ ఇంజినీర్లుగా పని చేస్తున్నారు. నవంబర్ 23న భువనేశ్వర్ లో వీరి వివాహం జరిగింది.

బుధవారం కర్నాటకలోని హుబ్బళిలో రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు హాజరయ్యేందుకు నవ దంపతులు ఇండిగో విమానంలో టికెట్లు బుక్ చేసుకున్నారు. అయితే, విమాన సర్వీసుల్లో అంతరాయం వల్ల ప్రయాణించడం కుదరలేదు. అప్పటికే వీరి రిసెప్షన్ కు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి.

వర్చువల్ తప్ప మరో మార్గం లేదు..

అతిథులు కూడా అప్పటికే వేడుకకు హాజరవడంతో.. ఇక మరో దారి లేక వధూవరులు వర్చువల్ గా ఇందులో పాల్గొన్నారు. అలా ఆన్ లైన్ లోనే రిసెప్షన్ తంతుని పూర్తి చేసేశారు. రిసెప్షన్ ఏర్పాటు చేసిన హాల్ లోనే బిగ్ స్క్రీన్ ఏర్పాటు చేసి వధూవరులను అతిథులకు చూపించారు. ఇక, ఆన్ లైన్ లోనే కొత్త జంటను బంధువులు సైతం ఆశీర్వదించారు. ప్రస్తుతం ఈ టెకీ దంపతులకు సంబంధించిన రిసెప్షన్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

తాము ప్రయాణించాల్సిన విమానం రద్దు కావడంతో నూతన వధూవరులు, వారి కుటుంబసభ్యులు తమ వివాహ రిసెప్షన్‌కు వర్చువల్‌గా హాజరు కావడం తప్ప మరో మార్గం లేకుండా పోయింది. వారిద్దరూ భువనేశ్వర్ నుండే రిసెప్షన్‌కు హాజరయ్యారు.

“మేము డిసెంబర్ 3న రిసెప్షన్ ప్లాన్ చేసుకున్నాము. అకస్మాత్తుగా ఉదయం 4 గంటలకు విమానం రద్దు చేశారు. వారు వస్తారని మేము ఆశించాము. కానీ వారు రాలేకపోయారు. అప్పటికే మేము చాలా మంది బంధువులను వేడుకకు ఆహ్వానించాము. వారంతా ఫంక్షన్ హాల్ కి చేరుకున్నారు. చివరి నిమిషంలో ఈవెంట్‌ను రద్దు చేయడం అసాధ్యం. కాబట్టి, కుటుంబంలో చర్చించుకుని నూతన జంట ఆన్‌లైన్‌లో రిసెప్షన్‌కు హాజరు కావాలని నిర్ణయించుకున్నాము” అని వధువు తల్లి తెలిపింది.

కాగా, దేశవ్యాప్తంగా ఇండిగో విమాన సర్వీసులు రద్దు అవుతున్నాయి. డిసెంబర్ 4 నాటికి ఇండిగో విమానయాన సంస్థ ఏకంగా 500 కి పైగా సర్వీసులను రద్దు చేసింది. విమానాలను నడపడానికి సిబ్బంది, ముఖ్యంగా పైలట్ల కొరత కారణంగా రద్దు చేయాల్సి వచ్చింది. FDLT (ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్స్) నిబంధనలు కూడా దీనికి కారణం.

Also Read: 2 రోజుల్లో 300కి పైగా విమానాలు ఎందుకు రద్దయ్యాయి? కారణం కొత్త నిబంధనలా? టెక్‌ సమస్యా? వాతావరణమా?