తీహార్ జైలులోనే ఉంచండి : చిదంబరం కస్టడీ పొడిగింపు

  • Published By: veegamteam ,Published On : September 19, 2019 / 11:13 AM IST
తీహార్ జైలులోనే ఉంచండి : చిదంబరం కస్టడీ పొడిగింపు

Updated On : September 19, 2019 / 11:13 AM IST

INXమీడియా కేసులో అరెస్ట్ అయిన కాంగ్రెస్ సీనియర్ లీడర్,మాజీ ఆర్థికమంత్రి చిదంబరానికి మరోసారి ఎదురు దెబ్బ తగిలింది. ఆయన కస్టడీని గురువారం(సెప్టెంబర్-19,2019)ఢిల్లీ న్యాయస్థాన మరోసారి పొడిగించింది. చిదంబరాన్ని మరి కొద్దిరోజుల పాటు విచారించాల్సి ఉందని, కస్టడీని పొడిగించాలని కోరుతూ సీబీఐ దాఖలు చేసిన పిటీషన్ ను ఢిల్లీ న్యాయస్థానం పరిశీలనలోకి తీసుకుంది. ఆయన కస్టడీని పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. విచారణ సందర్భంగా ఆయనను తీహార్ జైలులోనే ఉంచాలని సూచించింది. 

ఈ నెల 5వ తేదీ నుంచి చిదంబరం.. తీహార్ జైలులోని ఏడో నంబర్ క్లాంప్లెక్స్ కారాగారంలో ఉంటున్న విషయం తెలిసిందే. గురువారం నాటికి ఆయన కస్టడీ ముగిసింది. దీనితో సీబీఐ అధికారులు ఆయనను ఇవాళ న్యాయస్థానం ముందు హాజరు పరిచారు. చిదంబరం వయస్సు, అనారోగ్య కారణాలను దృష్టిలో ఉంచుకుని బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ చిదంబరం తరఫు న్యాయవాది కపిల్ సిబల్ దరఖాస్తును దాఖలు చేశారు. విచారణ కొనసాగిన కాలంలో చిదంబరం ఆరోగ్యం క్షీణించిందని, ఆయన గణనీయంగా బరువు తగ్గారని అన్నారు. అధిక రక్తపోటు, మధుమేహంతో పాటు కంటి చూపు సైతం మందగించిందని అన్నారు. జైలులో ప్రతిరోజూ క్రమం తప్పకుండా ఆరోగ్యాన్ని పరీక్షించుకోవడానికైనా అవకాశం కల్పించాలని కోరారు.

జైలులో కుర్చీ కానీ దిండు కానీ లేకపోవడంతో తనకు వెన్నునొప్పి పెరుగుతుందని కోర్టుకి చిదంబరం తెలిపారు. జైలు గది బయట  కుర్చీలు ఉండేవని,తానే పగటిపూట అక్కడ కూర్చునేవాడినని,తాను దానిని ఉపయోగిస్తున్నానని దానిని తీసేసేశారని, ఇప్పుడు వార్డెన్ కూడా కుర్చీ లేకుండా ఉన్నారని చిదంబరం అన్నారు.  అయితే ఇది ఒక చిన్న సమస్య అని దీన్ని సంచలనాత్మకం చేయవలసిన అవసరం లేదని ప్రభుత్వ న్యాయవాది తుషార్ మెహతా అన్నారు. మొదటి నుండి అతని గదిలో కుర్చీ లేదని అన్నారు. 

 కాగా- బెయిల్ కోసం చిదంబరం దాఖలు చేసుకున్న మరో పిటీషన్ ధర్మాసనం ముందుకు ఇంకా విచారణకు రాలేదు. ఈ నెల 23వ తేదీన బెయిల్ పిటీషన్ పై న్యాయమూర్తులు విచారణ చేపట్టనున్నారు.