హైదరాబాద్‌లోని “ధ్రువ స్పేస్” అద్భుతం.. ఇస్రో PSLV-C62/EOS-N1కు ఎందుకింత ప్రాధాన్యం? ఏం జరగనుంది?
ఈ ప్రయోగం ద్వారా మొత్తం 15 ఉపగ్రహాలు అంతరిక్షంలోకి చేరనున్నాయి.
PSLV-C62 (Image Credit To Original Source)
- ఆదివారం మధ్యాహ్నం 12.48 గంటలకు కౌంట్‌డౌన్ షురూ
- ఇస్రో 64వ పీఎస్ఎల్వీ మిషన్ ప్రయోగం
- 7 ఉపగ్రహాలను అందించిన “ధ్రువ స్పేస్” ప్రైవేట్ సంస్థ
ISRO Spy Satellite: భారత ప్రైవేట్ అంతరిక్ష వ్యవస్థకు ఊతమిచ్చే ఇస్రో స్పై శాటిలైట్ ప్రయోగం సోమవారం జరుగుతుంది. ఆదివారం మధ్యాహ్నం 12.48 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. ఇస్రో 64వ పీఎస్ఎల్వీ మిషన్ ప్రయోగం ఇది.
పీఎస్ఎల్వీ-సీ62/ఈఓఎస్-ఎన్1గా ఈ మిషన్‌ను పిలుస్తున్నారు. సోమవారం ఉదయం 10.17 గంటలకు శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి పీఎస్ఎల్వీ-సీ62 నింగిలోకి దూసుకెళ్తుంది. ఈ ప్రయోగం ద్వారా మొత్తం 15 ఉపగ్రహాలు అంతరిక్షంలోకి చేరనున్నాయి. ఇందులోని ప్రధాన ఉపగ్రహమే ఈఓఎస్-ఎన్1.
ఇస్రో ప్రయోగించే 15 ఉపగ్రహాల్లో రక్షణ పరిశోధనాభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) అభివృద్ధి చేసిన అత్యంత రహస్య గూఢచారి ఉపగ్రహం “అన్వేషా” కూడా ఉంది. ఈ ఉపగ్రహాన్ని అత్యాధునిక చిత్రీకరణ సామర్థ్యాలతో శత్రు స్థావరాలను అత్యంత కచ్చితత్వంతో గుర్తించేలా రూపకల్పన చేశారు.
Also Read: మొన్ననే వెనెజువెలాపై దాడి.. ఇప్పుడు క్యూబాకు ట్రంప్ వార్నింగ్.. ఇక లేట్ చేయొద్దంటూ..
వ్యూహాత్మక పేలోడ్‌కు మించి మరో చారిత్రక అంశం ఈ మిషన్‌కు ఉంది. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ధ్రువ స్పేస్ ప్రైవేట్ సంస్థే ఈ మిషన్‌కు 7 ఉపగ్రహాలు అందించింది.
ఇస్రో ఛైర్మన్ డాక్టర్ వీ నారాయణన్ దీని గురించి వివరాలు తెలుపుతూ.. హైదరాబాద్ సంస్థ ధ్రువ స్పేస్ అందించిన ఏడు ఉపగ్రహాల ద్వారా భారత ప్రైవేట్ అంతరిక్ష రంగం ఎలా అభివృద్ధి చెందుతుంతో తెలుస్తోందని అన్నారు. ఇది కొత్త ప్రమాణాన్ని ఏర్పరుస్తోందని కొనియాడారు. మిగిలిన 8 ఉపగ్రహాలు కూడా ప్రత్యేకతతో కూడినవేనని అన్నారు. వీటిలో ఒక రీ-ఎంట్రీ మాడ్యూల్ కూడా ఉందని తెలిపారు.
పీఎస్ఎల్వీ-సీ62 మిషన్ న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్ నిర్వహిస్తున్న తొమ్మిదవ ప్రత్యేక వాణిజ్య మిషన్. మొత్తం పీఎస్ఎల్వీ ప్రయోగాల్లో ఇది 64వది.
నమ్మకాన్ని తిరిగి నెలకొల్పేలా..
గత ఏడాది మేలో జరిగిన చివరి పీఎస్ఎల్వీ మిషన్ రాకెట్ మూడో దశలో తలెత్తిన లోపం కారణంగా విఫలమైంది. భారత అత్యంత విశ్వసనీయ ప్రయోగ వాహనంగా పేరొందిన పీఎస్ఎల్వీ (PSLV – పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్)పై నమ్మకాన్ని తిరిగి నెలకొల్పడం కూడా పీఎస్ఎల్వీ-సీ62/ఈఓఎస్-ఎన్1 మిషన్ లక్ష్యం.
