సభలో ఏడ్చిన జయప్రద: యాసిడ్ పోస్తానని బెదిరించారు

బీజేపీ ఎంపీ అభ్యర్థి జయప్రద ప్రచార సభలో కన్నీరు పెట్టారు. ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తు కంటతడి పెట్టారు. సమాజ్ వాదీ పార్టీ నేత అజామ్ ఖాన్ తనను తీవ్ర వేధింపులకు గురిచేశారని చెబుతూ కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. రాంపూర్ ను వదిలిపెట్టి వెళ్లకపోతే యాసిడ్ పోస్తానంటూ బెదిరించారని జయప్రద ఈ సందర్బంగా కన్నీరు పెడుతు తెలిపారు.
సినీ రంగం నుంచి రాజకీయ రంగంవైపు వెళ్లిన అలనాటి హీరోయిన్ జయప్రద పాలిటిక్స్ లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. సమాజ్ వాదీ పార్టీలో ఎన్నో చేదు అనుభవాలు చవిచూసిన అనంతరం ఈ లోక్ సభ ఎన్నికల్లో ఆమె బీజేపీ తరఫున పోటీచేస్తున్నారు. యూపీలో తన పాత నియోజక వర్గం అయిన రాంపూర్ నుంచే ఆమె పోటీచేస్తున్నారు.
తన పుట్టినరోజుకు బీజేపీ ఇచ్చిన కానుక ఈ ఎంపీ టికెట్ అని తెలిపారు. తన ప్రసంగం మధ్యలో ఉద్వేగానికి గురైన ఆమె కాసేపు మాట్లాడలేకపోయారు. దీంతో బీజేపీ కార్యకర్తలు వేదికపైకి వచ్చి జయప్రదను ఓదారుస్తు..ఎన్నికలు ముగిసేవరకు జయప్రదకు అన్ని విధాలుగా అండదండలు అందిస్తామంటూ భరోసానిచ్చారు. దాంతో ఆమె ఊరడిల్లారు. అనంతరం ఉత్సాహంగా మాట్లాడుతు..ఆరోజు తీవ్ర మానసిక వేదనకు గురయ్యాననీ కానీ ఈరోజు తనవెంట బీజేపీ సైన్యం తోడుగా ఉందనీ..ఇంకెప్పుడు కన్నీరు పెట్టననీ కళ్లు తుడుచుకుని మళ్లీ తన ప్రసంగం కొనసాగించారు జయప్రద.