ఎగ్జిట్ పోల్స్…జార్ఖండ్ లో కాంగ్రెస్ కూటమిదే అధికారం

  • Published By: venkaiahnaidu ,Published On : December 20, 2019 / 03:45 PM IST
ఎగ్జిట్ పోల్స్…జార్ఖండ్ లో కాంగ్రెస్ కూటమిదే అధికారం

Updated On : December 20, 2019 / 3:45 PM IST

జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. 81స్థానాలున్న జార్ఖండ్ లో అయిదు దశల్లో జరిగిన ఎన్నికలు జరిగాయి. నవంబర్ 30న మొదటి దశ, డిసెంబర్ 7న రెండోదశ, 12న మూడో దశ ఓటింగ్, 16 న నాలుగో దశ ఓటింగ్ జరిగింది. ఇవాళ(డిసెంబర్-20,2019)తో ఐదో దశ ఓటింగ్ ముగిసింది. డిసెంబర్ 23 న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. 

అయితే అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగియడంతో ఎగ్జిట్ పోల్స్ వెలువడుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ ఫలితాల ప్రకారం బీజేపీ వెనుకబడినట్టు కనిపిస్తోంది. కాంగ్రెస్, జేఎమ్ఎమ్ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్టు ఎగ్జిట్ పోల్స్ అంచనాలు చెబుతున్నాయి. ఈ కూటమికి 38-50సీట్లు వస్తాయని అంచనా వేశాయి. కాంగ్రెస్ కూటమికి37శాతం ఓట్లు వచ్చే అవకాశముందని ఇండియా టుడే ఎగ్జిట్ పోల్ తెలిపింది. బీజేపీకి 22-32 సీట్లు వచ్చే అవకాశముందని తెలిపింది. అయితే జార్ఖండ్ లో హంగ్ అసెంబ్లీ ఏర్పాడుతుందని ఐఏఎన్ఎస్-సీ ఓటర్ సర్వే తెలిపింది. కాంగ్రెస్ కూటమికి 35సీట్లు,బీజేపీకి 32 సీట్లు వస్తాయని తెలిపింది.

2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 37, ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్‌కు 5, జార్ఖండ్ ముక్తి మోర్చా 19, కాంగ్రెస్ పార్టీకి 6 సీట్లు వచ్చాయి. జేవీఎం (పీ) పార్టీ తరఫున 8 మంది ఎమ్మెల్యేలు విజయం సాధించినా, వారు ఆ తర్వాత బీజేపీలో చేరిపోయారు. లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని జనతాదళ్ పార్టీకి 2014లో ఒక్క సీటు కూడా రాలేదు.