Anti-Conversion Bill : నిరసనల మధ్యే..మత మార్పిడి నిరోధక బిల్లుకి కర్ణాటక అసెంబ్లీ ఓకే

 వివాదాస్పద "కర్ణాటక మత స్వేచ్ఛ హక్కు రక్షణ బిల్లు- 2021(మతమార్పిడి నిరోధక బిల్లు)"ను ఇవాళ ఆ రాష్ట్ర అసెంబ్లీ మూజువాణి ఓటు ద్వారా ఆమోదించింది.

Anti-Conversion Bill : నిరసనల మధ్యే..మత మార్పిడి నిరోధక బిల్లుకి కర్ణాటక అసెంబ్లీ ఓకే

Karnataka 12

Updated On : December 23, 2021 / 8:37 PM IST

Anti-Conversion Bill : వివాదాస్పద “కర్ణాటక మత స్వేచ్ఛ హక్కు రక్షణ బిల్లు- 2021(మతమార్పిడి నిరోధక బిల్లు)”ను ఇవాళ ఆ రాష్ట్ర అసెంబ్లీ మూజువాణి ఓటు ద్వారా ఆమోదించింది. అయితే ఈ బిల్లును కాంగ్రెస్,జేడీఎస్ తీవ్రంగా వ్యతిరేకించాయి. బిల్లు ప్రవేశపెట్టే సమయంలో అసెంబ్లీలో ప్రతిపక్ష కాంగ్రెస్, జేడీయూ తీవ్ర నిరసన తెలిపాయి. బిల్లును వ్యతిరేకిస్తూ ప్రతిపక్ష సభ్యులు స్పీకర్ వెల్​లోకి దూసుకెళ్లారు. రాజ్యాంగ విరుద్ధమైన ఈ బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో సభలో గందరగోళం ఏర్పడింది.

సభలో బిల్లును ప్రవేశపెట్టిన తర్వాత కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాట్లాడుతూ.. ఈ బిల్లును ఆరెస్సెస్ అజెండాగా అభివర్ణించారు. దీనిపై స్పందించిన గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కేఎస్ ఈశ్వరప్ప.. ఇది దేశ ‘సంస్కృతి’ని కాపాడటానికి తీసుకొచ్చిన బిల్లు అని అన్నారు. అయితే గతంలో సిద్దరామయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈ బిల్లు తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ ప్రయత్నించిందని కర్ణాటక న్యాయశాఖ మంత్రి జేసీ మధుస్వామి అన్నారు.

కర్ణాటక మత స్వేచ్ఛ హక్కు రక్షణ బిల్లు- 2021.. ప్రలోభాలకు గురిచేయడం ద్వారా కానీ, బలవంతంగా కానీ, మోసపూరిత విధానాల ద్వారా కానీ, సామూహికంగా కానీ మతమార్పిడులను నిరోధిస్తుంది. బలవంతంగా, బెదిరించి మత మార్పిడికి పాల్పడితే.. 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, రూ.50వేల వరకు జరిమానా విధిస్తారు. ఎస్సీ, ఎస్టీ మహిళలు, మైనర్లు, బధిరులను మతమార్పిడి చేస్తే 3- 10 ఏళ్ల వరకు జైలు శిక్ష ఉంటుంది. అలాగే, ఇతర కమ్యూనిటీలకు చెందిన వ్యక్తులను మతం మారేలా ప్రేరేపిస్తే.. గరిష్ఠంగా 5 ఏళ్ల జైలు, రూ.25వేల వరకు ఫైన్ విధిస్తారు.

సామూహిక మత మార్పిళ్లు చేస్తే.. 3-10 ఏళ్ల జైలు శిక్ష పడుతుంది. మతాన్ని మార్చాలనే ఉద్దేశంతో డబ్బులు, కానుకలు, ఉపాధి, ఉచిత విద్య, వివాహాలు, మంచి జీవన విధానం వంటివి చూపించి ఆకర్షించే ప్రయత్నాలను సైతం నేరంగా పరిగణిస్తారు. ఇలాంటి వాటిలో పాల్గొనే ఎన్​జీఓలు, మతపరమైన మిషనరీలు​, ఆసుపత్రులు, వృద్ధాశ్రమాలు, అనాథ శరణాలయాలు, విద్యా సంస్థలకు నిధులను నిలిపివేయనున్నారు. బలవంతపు మత మార్పిడి ఏ విధంగా జరిగినా నాన్ ​బెయిలబుల్​ నేరంగా పరిగణించబడుతుంది. మతమార్పిడి నిరూపితమైతే.. బాధితుడికి రూ.5 లక్షల పరిహారం అందించనున్నారు. ఇప్పటికే ఉత్తర్​ప్రదేశ్​, మధ్యప్రదేశ్​, గుజరాత్​ ప్రభుత్వాలు ఇప్పటికే ఈ తరహా చట్టాన్ని అమల్లోకి తెచ్చిన విషయం తెలిసిందే.

ALSO READ AP Corona Cases : ఏపీలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు.. మరో ముగ్గురు మృతి