Karnataka Budget 2023: కర్ణాటక ఎన్నికల వేళ ఇచ్చిన 5 హామీల అమలుకు బడ్జెట్ కేటాయింపులు.. ఇక తెలంగాణలోనూ ఇదే ఫార్ములా?
గృహ లక్ష్మి కింద కుటుంబ పెద్దగా ఉన్న ప్రతి మహిళకు ప్రతి నెల రూ.2,000 ఇస్తారు.

Karnataka Budget 2023
Karnataka Budget 2023: కర్ణాటక ఎన్నికల వేళ ఇచ్చిన 5 ప్రధాన హామీల అమలుకు ఆ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం (Congress government) బడ్జెట్లో కేటాయింపులు చేసింది. ఇవాళ సీఎం సిద్ధరామయ్య (Siddaramaiah) కర్ణాటక అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్ -2023 ప్రవేశపెట్టారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన 5 ప్రధాన హామీల అమలు కోసం ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ.35,410 కోట్లు కేటాయించారు.
ఇంతకుముందే దీనిపై కేబినెట్ లోనూ చర్చించిన సిద్ధరామయ్య, ఆ హామీల రూపకల్పనకు ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. కర్ణాటకలో గృహ జ్యోతి, గృహ లక్ష్మి, అన్న భాగ్య, యువ నిధి, శక్తి పథకాలను అమలు చేయనున్నారు. ఈ బడ్జెట్ ను గ్యారంటీ బడ్జెట్ గా సిద్ధరామయ్య అభివర్ణించారు. గృహ జ్యోతి పథకం కింద ప్రతి ఇంటికి నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇవ్వనున్నారు.
అలాగే, గృహ లక్ష్మి కింద కుటుంబ పెద్దగా ఉన్న ప్రతి మహిళకు ప్రతి నెల రూ.2,000 ఇస్తారు. అన్న భాగ్య పథకం దారిద్య్ర రేఖకు దిగువ ఉన్న కుటుంబంలోని ప్రతి వ్యక్తికి వర్తిస్తుంది. ప్రతి నెల 10 కిలోల బియ్యం ఇస్తారు. యువ నిధి కింద నిరుద్యోగ గ్రాడ్యుయేట్లకు ప్రతి నెల రూ.3,000 భృతి, డిప్లొమా ఉండి ఉద్యోగం లేని వారికి ప్రతి నెల రూ.1,500 ఇవ్వనున్నారు.
అయితే, ఇది రెండు సంవత్సరాల పాటు అమల్లో ఉంటుంది. అంతేగాక, 18-25 ఏళ్ల వయస్సు మధ్య ఉన్న వారికి అందిస్తారు. శక్తి పథకం కింద ఆర్డినరీ పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు బస్సుల్లో మహిళలు ఉచిత ప్రయాణం చేయొచ్చు. ఇప్పటికే దీన్ని అమల్లోకి తెచ్చారు. ఆయా పథకాలకు ఏడాదికి దాదాపు రూ.50,000 కోట్లు ఖర్చు అవుతాయని సిద్ధరామయ్య ఇంతకు ముందు చెప్పిన విషయం తెలిసిందే. కర్ణాటక ఆదాయాన్ని పెంచుకునేందుకు ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించింది.
భారత్ లో తయారైన లిక్కర్ పై ఎక్సైజ్ డ్యూటీని 20 శాతం పెంచుతున్నట్లు సిద్ధరామయ్య ప్రకటించారు. దీంతో కర్ణాటకలో మద్యం ధరలు భారీగా పెరుగుతాయి. కర్ణాటకలో మోరల్ పోలీసింగ్ పేరుతో వేషాలు వేసేవారిపై అలాగే, సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలుంటాయని సిద్ధ రామయ్య అసెంబ్లీ బడ్జెట్ సందర్భంగా హెచ్చరించారు. కర్ణాటకలోకి తాత్కాలిక ఉద్యోగులకు, ఇతర కార్మికులకు రూ.4 లక్షల వరకు బీమా సౌకర్యం అందిస్తామన్నారు. రాష్ట్ర రాజధానిలో మౌలిక సదుపాయాల కోసం పలు కార్యక్రమాలను అమలు చేస్తామన్నారు.
ఇక తెలంగాణలోనూ ఇదే ఫార్ములా?
కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపునకు ఆ 5 హామీలు బాగా పనిచేశాయి. కర్ణాటకలో గెలిచినట్లే తెలంగాణలోనూ అదే ఫార్ములాతో గెలవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. కర్ణాటక ప్రకటించిన హామీల వంటివే ప్రకటించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. కర్ణాటకలో అనుసరించిన వ్యూహాలే తెలంగాణలోనూ అనుసరించాలని యోచిస్తోంది. ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామన్న సందేశాన్ని కర్ణాటక ద్వారా ఇస్తోంది.
Narayanaswamy Kalathuru : డిప్యూటీ సీఎంని నిలదీసిన కానిస్టేబుల్‌పై సస్పెన్షన్ వేటు