కర్ణాటక పీసీసీ చీఫ్ శివకుమార్‌కు కరోనా

కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్‌కు కరోనా వైరస్ సోకింది. మంగళవారం ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా ఆయనే స‍్వయంగా వెల్లడించారు. జ్వరంతో బాధపడుతున్న తనకు కోవిడ్-19 టెస్ట్ నిర్వహించగా పాజిటివ్‌గా వచ్చిందని, ముందుజాగ్రత్తతో ఆస్పత్రిలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నానని చెప్పారు. మీ దీవెనలతో తాను ఆరోగ్యంగా తిరిగివస్తానని డీకే శివకుమార్ ట్వీట్ చేశారు. తనను ఇటీవల కలిసిన వారంతా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
కాగా, కర్ణాటక రాష్ట్రంలో వరదలు సంభవించిన ప్రాంతాల్లో తన పర్యటనను వాయిదా వేసుకున్నట్టు ఆయన శనివారం ట్వీట్ చేయడం గమనార్హం. బెలగావి, బాగల్కోట్ జిల్లాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో తన పర్యటనను ఆరోగ్య కారణాలతో మూడు రోజులు వాయిదా వేస్తున్నట్టు శనివారం ఆయన ట్వీట్ చేశారు. వకుమార్ త్వరగా కోలుకోవాలని పలువురు నాయకులు ట్వీట్ చేశారు.
మరోవైపు, కరోనా వైరస్ బారినపడిన కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప,విపక్ష నేత సిద్ధరామయ్యలు వైరస్ నుంచి కోలుకున్నారు. వీరితో పాటు ఆరోగ్య మంత్రి శ్రీరాములు సహా నలుగురు మంత్రులకు కోవిడ్-19 పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కోవిడ్-19 కేసులు అధికంగా నమోదైన రాష్ట్రాల్లో కర్ణాటక నాలుగో స్ధానంలో ఉంది. కర్ణాటకలో ఇప్పటివరకూ 3.61 లక్షలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవగా,4810 మంది మరణించారు.