Karnataka high court: పెళ్లి చేసుకున్నవారే కాదు.. సహజీవనం చేసేవారూ ఈ చట్టం కింద కేసువేసి మీ పార్ట్‌నర్‌కి శిక్షపడేలా చేయొచ్చు..
సెక్షన్ 498ఏలో భర్త అనే పదం చట్టబద్ధ వివాహం చేసుకున్న వ్యక్తికే పరిమితం కాదు.
Karnataka high court: భార్యపై భర్త హింసకు పాల్పడితే అతడికి శిక్షలు విధించేందుకు చట్టాలు ఉన్నాయి. మరి సహజీవనం (live-in relationship) చేస్తున్న జంటలో యువతిపై యువకుడు హింసకు పాల్పడితే ఎలా? దీనిపై కర్ణాటక హైకోర్టు కీలక నిర్ణయాన్ని వెల్లడించింది.
భార్యపై క్రూరత్వానికి పాల్పడే భర్తను శిక్షించేందుకు ఉన్న ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 498ఏ… లివ్ ఇన్ సంబంధాలకు కూడా వర్తిస్తుందని తెలిపింది. అలాగే చట్టంలో చెల్లుబాటుకాని లేదా రద్దు చేయగలిగే వివాహాలకు కూడా ఇది వర్తిస్తుందని చెప్పింది.
హైకోర్టు న్యాయమూర్తి సురజ్ గోవిందరాజ్ నవంబర్ 18న ఇచ్చిన ఈ ఆర్డర్‌లో.. “భర్త” అనే పదం చట్టపరంగా చెల్లుబాటు అయ్యే వివాహంలో ఉన్న వ్యక్తికే పరిమితం కాదని, వివాహానికి సమానమైన సంబంధం లేదా వివాహ లక్షణాలు ఉన్న లివ్ ఇన్ సంబంధానికి కూడా వర్తిస్తుందని పేర్కొన్నారు. అటువంటి పరిస్థితుల్లో సెక్షన్ 498ఏ కింద కేసు నమోదు చేయవచ్చు, విచారణ జరపవచ్చని స్పష్టం చేశారు.
“సెక్షన్ 498ఏలో భర్త అనే పదం చట్టబద్ధ వివాహంలో ఉన్న వ్యక్తికే పరిమితం కాదు. చట్టంలో చెల్లుబాటుకాని లేదా రద్దు చేయగలిగే వివాహాలకు కూడా ఇది వర్తిస్తుంది. వివాహ లక్షణాలు ఉన్న సహజీవన సంబంధానికి కూడా వర్తిస్తుంది. ఆ వ్యక్తి ప్రవర్తన 498ఏలో ఉన్న క్రూరత్వం అనే పద నిర్వచనానికి సరిపోతే ఈ సంబంధాలన్నింటికీ ఈ చట్టం వర్తిస్తుంది” అని హైకోర్టు తెలిపింది.
ఈ కేసులోనే వాదనలు వింటూ పై ఆర్డర్స్..
తన రెండో భార్య ఇచ్చిన ఫిర్యాదుతో నమోదు చేసిన కేసును రద్దు చేయాలని కోరుతూ ఓ వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించే సమయంలో ఈ పై వ్యాఖ్యలను హైకోర్టు చేసింది. ఆ భర్త చేసిన ఫిర్యాదు ప్రకారం.. పిటిషనర్‌కు ఇప్పటికే ఒక వివాహం జరిగింది. ఆ మహిళతో అతడికి ఒక కుమార్తె కూడా ఉంది. అయినప్పటికీ, 2010లో మరో మహిళను వివాహం చేసుకున్నాడు.
అతడు రెండో భార్యతో 2016లో తెగదెంపులు చేసుకున్నాడు. రెండో భార్య అతడిపై క్రూరత్వం, కట్నం డిమాండ్లు, శారీరక హింస వంటివి ఆరోపిస్తూ సెక్షన్ 498ఏ కింద ఫిర్యాదు చేసింది. తన భర్త మొదటి వివాహాన్ని కూడా దాచి తనను పెళ్లి చేసుకున్నాడని కూడా ఆరోపించింది.
పిటిషనర్ (భర్త) తరఫు న్యాయవాది హర్ష కుమార్ గౌడ వాదన ప్రకారం.. ఫిర్యాదు చేసిన మహిళ నిజానికి చట్టపరంగా వివాహం చేసుకున్న మహిళ కాదని, కాబట్టి సెక్షన్ 498ఏ వర్తించదని తెలిపారు.
పిటిషనర్ ముందు చేసుకున్న వివాహం చెల్లుబాటు అయినందున రెండో వివాహం చట్టబద్ధం కాదని, ఫిర్యాదు చేసిన మహిళతో ఉన్న సంబంధం లివ్ ఇన్ సంబంధం అని చెప్పారు. సెక్షన్ 498ఏ చట్టబద్ధ వివాహం చేసుకున్న సందర్భంలోనే వర్తిస్తుందని అన్నారు.
ఆ సమయంలోనే హైకోర్టు ఆ న్యాయవాది వాదనను అంగీకరించలేదు. భర్త లేదా అతడి బంధువుల నుంచి మహిళ ఎదుర్కొనే క్రూరత్వం నుంచి రక్షించడం సెక్షన్ 498ఏ ఉద్దేశమని, ఇది మహిళ గౌరవం, భద్రత కాపాడే సామాజిక రక్షణ అని పేర్కొంది.
