Karnataka Politics : కర్ణాటక రాజకీయాల్లో సంచలనం.. మంత్రి బి. నాగేంద్ర మళ్లీ రాజీనామా.. మీడియా ముందు కన్నీళ్లు!
Karnataka Politics : నిధుల దుర్వినియోగం, వాల్మీకి కుంభకోణం వంటి ఆరోపణల నేపథ్యంలో కర్ణాటక గిరిజన సంక్షేమశాఖ మంత్రి బి. నాగేంద్ర రెండోసారి రాజీనామా చేశారు. తనపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని స్పష్టం చేశారు.
Karnataka Minister B Nagendra
- కర్ణాటక మంత్రి నాగేంద్ర రాజీనామా
- అవినీతి ఆరోపణలతో నిర్ణయం
- సీఎం డీకే శివకుమార్‌కు రాజీనామా అందజేత
Karnataka Politics : కర్ణాటక రాజకీయాల్లో మరో సంచలనం చోటుచేసుకుంది. నిధుల దుర్వినియోగం ఆరోపణల నేపథ్యంలో ఆ రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి బి. నాగేంద్ర రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా పత్రాన్ని రాష్ట్ర సీఎం డీకే శివకుమార్‌కు అందజేశారు. రాజకీయంగా తనపై ఆరోపణలు, ప్రతిపక్షాల నిరసనలు తీవ్రతరం అవుతున్న సమయంలో నాగేంద్ర రాజీనామా నిర్ణయం
ప్రాధాన్యత సంతరించుకుంది.
రాజీనామా అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. తనపై వచ్చిన ఆరోపణలను నాగేంద్ర తీవ్రంగా ఖండించారు. తాను ఎలాంటి తప్పు చేయలేదన్నారు. తనపై చేస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవమని పేర్కొన్నారు. ఆగస్టు 3న క్యాబినెట్లోకి తిరిగి చేరిన తర్వాత నాగేంద్ర బాధ్యతలు స్వీకరించిన 25 రోజుల్లోపే పదవి నుంచి వైదొలిగారు.
తాను దళిత వర్గానికి చెందిన నేత కారణంగానే తనను రాజకీయంగా టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు. అయితే, ఈ వ్యవహారం కారణంగా ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి చెడ్డపేరు రాకూడదనే ఉద్దేశంతోనే స్వచ్ఛందంగా తాను పదవి నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించారు.
ఇదిలా ఉండగా, మహర్షి వాల్మీకి షెడ్యూల్డ్ తెగల సంక్షేమ అభివృద్ధి సంస్థకు చెందిన కోట్లాది రూపాయల నిధులు అక్రమంగా ఇతర ఖాతాలకు మళ్లించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. దాంతో కర్ణాటక రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఈ అంశంపై సమగ్ర విచారణ జరపాలంటూ జేడీఎస్, బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు కూడా చేపట్టారు.
ఇటీవలి వర్షాకాల సమావేశాల్లో కూడా ఈ అంశాన్ని ప్రతిపక్షాలు శాసనసభలో, బయటా ప్రస్తావించాయి. మంత్రి పదవి నుంచి నాగేంద్ర తప్పుకోవాలని డిమాండ్ చేశాయి. రాజకీయ ఒత్తిడుల నేపథ్యంలో సీఎం డీకే శివకుమార్‌ను కలిసిన ఆయన తన రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించారు. తనపై జరుగుతున్న విచారణలో తాను నిర్దోషిగా బయటకు వస్తాననే నమ్మకం ఉందని స్పష్టం చేశారు.
