కర్ణాటకలో నీటి కష్టాలు.. బెంగళూరులో ఎండిపోయిన బోర్లు.. తాగునీటికి కటకట

తాగు నీళ్ల కోసం బెంగళూరు వాసులు కష్టాలు పడుతున్నారు. ఇప్పుడే ఇలావుంటే.. ఏప్రిల్, మే నెల గురించి తల్చుకుంటేనే భయమస్తోందని బెంగళూరు వాసులు ఆందోళన చెందుతున్నారు.

కర్ణాటకలో నీటి కష్టాలు.. బెంగళూరులో ఎండిపోయిన బోర్లు.. తాగునీటికి కటకట

Karnataka water crisis Bengaluru faces severe water shortage

Karnataka water crisis: వేసవికి ముందే కర్ణాటకలో నీటి కష్టాలు మొదలయ్యాయి. సకాలంలో వర్షాలు కురవకపోవడంతో సాగు, తాగు నీటికి కర్ణాటకలో కరువొచ్చింది. నీళ్లు దొరక్క చాలా ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాగు నీటి కోసం ప్రజలు బిందెలతో వాటర్ ట్యాంకర్ల ముందు బారులు తీరుతున్నారు. మార్చి మొదటి వారంలోనే పరిస్థితి ఇలావుంటే మున్ముందు ఎలా ఉంటుందోనని కర్ణాటక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వర్షాల్లేక రాష్ట్రంలో ఈసారి కరువొచ్చింది. మొత్తం 236 తాలూకాల్లో 223 కరువు బారిన పడ్డాయి. 219 తాలుకాల్లో కరువు ప్రభావం చాలా ఎక్కువగా ఉందని సర్కారు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

ప్రభుత్వ ఖర్చులతో తాగునీరు సరఫరా
ప్రజలను తాగునీటి కష్టాల నుంచి గట్టెక్కించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. కరువు ప్రాంతాల్లో ప్రభుత్వ ఖర్చులతో తాగునీరు సరఫరా చేయనున్నట్టు సీఎం సిద్ధరామయ్య ప్రకటించారు. ఇందుకోసం కలెక్టర్ల ఖాతాలో 854 కోట్ల రూపాయలు ఉంచినట్టు వెల్లడించారు. వర్షాలు లేకపోవడం వల్లే నీటి సమస్య తలెత్తిందని, అధికారులు సమన్వయంతో పనిచేసి నీటి ఎద్దడిని ఎదుర్కొవాలని సూచించారు. అధికారులు ఏమాత్రం అలసత్వం ప్రదర్శించవద్దని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు.

సీఎం, డిప్యూటీ సీఎంకు తప్పని కష్టాలు
సామాన్యులకే కాదు.. సీఎం, డిప్యూటీ సీఎంలకు కూడా నీటి కష్టాలు తప్పడం లేదు. బెంగళూరులోని ముఖ్యమంత్రి అధికారిక నివాసానికి సర్కారు నల్లా నుంచి నీళ్లు రావడం లేదు. దీంతో జలమండలి అధికారులు ట్యాంకర్లతో నీటిని సరఫరా చేయాల్సివస్తోంది. తాను కూడా నీటి ఎద్దడి బారిన పడినట్టు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తెలిపారు. తన ఇంటి వద్ద ఉన్న బోరుబావులు సహా బెంగళూరు నగరంలో దాదాపు 3 వేలకు పైగా బోర్లు ఎండిపోయాయని వెల్లడించారు. నీటి కష్టాలు తీర్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నామని ఇందుకోసం రాష్ట్రంలో నీటి లభ్యత ఉన్న అన్ని పాయింట్లను గుర్తించేందుకు 24 గంటలూ కృషి చేస్తున్నామని ఆయన చెప్పారు.

DK Shivakumar on Bengaluru water crisis

ప్రైవేటు ట్యాంకర్ల వసూళ్ల దందా
కాగా, గ్రామాలతో పాటు కర్ణాటక రాజధాని బెంగళూరులోనూ ప్రజలు నీటి కోసం కష్టాలు పడుతున్నారు. తీవ్రమైన నీటి కొరత కారణంగా బెంగళూరులో నీటి ట్యాంకర్ల ఫుల్ డిమాండ్ ఏర్పడింది. అయితే ప్రైవేటు ట్యాంకర్ల నిర్వాహకులు ధరలు విపరీతంగా పెంచేసి అందినకాడికి దోచుకుంటున్నారు. ఇంతముందు 5 వేల లీటర్ల ట్యాంకర్ రూ.500కు దొరికేది. కానీ ఇప్పుడు 2 నుంచి 4 వేల రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. నగరంలోని 14,000 బోర్‌వెల్స్‌లో సుమారు 7,000 ఎండిపోవడంతో నీటి సరఫరాలో 50 శాతం కొరత ఏర్పడింది. ప్రైవేటు ట్యాంకర్ల దందాపై ప్రభుత్వం సీరియస్ అయింది. ఎక్కువ రేట్లకు నీళ్లు అమ్మితే కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చింది.

Also Read: డిజిటల్ హౌస్ అరెస్ట్ గురించి తెలుసుకుని అప్రమత్తంగా ఉండండి: పోలీసులు

సోషల్ మీడియాలో నీళ్ల బాధలు
నీటి బాధలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు బెంగళూరు వాసులు. నీటి ఎద్దడి నేపథ్యంలో నీళ్లను ఆదా చేయడానికి ప్రెస్టీజ్ ఫాల్కన్ సిటీ అపార్ట్‌మెంట్ వాసులు డిస్పోజబుల్ప్లేట్లు, గ్లాసులు వాడుతున్నారని ఓ నెటిజన్ వెల్లడించారు. ముఖం, చేతులు కడుక్కోవడానికి వెట్ పేపర్లు వినియోగిస్తున్నారని తెలిపారు. ఇప్పుడే ఇలావుంటే.. ఏప్రిల్, మే నెల గురించి తల్చుకుంటేనే భయమస్తోందని బెంగళూరు వాసులు ఆందోళన చెందుతున్నారు. నీటి సమస్య నివారణకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు.