Karur Stampede: ఒక్కొక్కరికి రూ.10లక్షలు.. కరూర్ తొక్కిసలాట ఘటన.. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం నష్ట పరిహారం
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్యం అందించాలని సీఎం స్టాలిన్ ఆదేశించారు.

Karur Stampede: కరూర్ తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు స్టాలిన్ ప్రభుత్వం నష్టపరిహారం ప్రకటించింది. ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున సాయం చేస్తామని సీఎం స్టాలిన్ తెలిపారు. తొక్కిసలాట ఘటనలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి లక్ష రూపాయలు పరిహారం అందించనున్నట్లు ప్రకటించారు. కరూర్ వెళ్లనున్న సీఎం స్టాలిన్.. అక్కడ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించనున్నారు.
మరోవైపు తొక్కిసలాట ఘటనపై విచారణకు ఆదేశించారు సీఎం స్టాలిన్. తొక్కిసలాటకు దారితీసిన పరిస్థితులను పరిశోధించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేశారు. వెంటనే ఘటనా స్థలానికి వెళ్లాలని తిరుచిరాపల్లి, సేలం, దిండిగల్ కలెక్టర్లను ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రస్తుతానికి, విచారణ ప్రాథమిక దశలో ఉంది. కమిషన్ సాక్ష్యాలను సేకరించే అవకాశం ఉంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్యం అందించాలని సీఎం స్టాలిన్ ఆదేశించారు.
”ప్రజలు ప్రాణాలు కోల్పోవడం అందరి హృదయాలను కలచివేసింది. ఈ పూడ్చలేని నష్టాన్ని చవిచూసిన కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా. ఆసుపత్రిలో చేరిన వారందరికీ ఉత్తమ వైద్య చికిత్స అందించాలని ఆదేశించాను. మృతుల కుటుంబాలను కలవడానికి, నా సంతాపాన్ని తెలియజేయడానికి, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించడానికి నేను ఈ రాత్రి కరూర్‌కు ప్రయాణమవుతాను” అని సీఎం స్టాలిన్ తెలిపారు.
తొక్కిసలాట ఘటనపై దర్యాప్తు కోసం రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి అరుణా జగదీశన్ నేతృత్వంలో ఏకసభ్య విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేస్తామని సీఎం స్టాలిన్ చెప్పారు.