Karur Stampede: 38మంది మృతి.. విజయ్‌ని అరెస్ట్ చేయాలని డిమాండ్..
ఇది నిర్వాహాకుల చౌకబారు కుట్ర. ఇందులో వారి నేరపూరిత నిర్లక్ష్యం ఉందని ఆయన ఆరోపించారు.

Karur Stampede: తమిళనాడు రాష్ట్రం కరూర్ లో పెను విషాదం చోటు చేసుకుంది. తమిళగ వెట్రి కళగం (టీవీకే) చీఫ్, సినీ నటుడు విజయ్ కరూర్ ప్రచార సభలో తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో 38 మంది మరణించారు. మృతుల్లో 10 మంది చిన్నారులు ఉన్నారు. 17 మంది మహిళలు ఉన్నారు. కరూర్‌లో విజయ్ నిర్వహించిన ప్రచార సభకు భారీ సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు, జనం తరలి వచ్చారు. విజయ్ ప్రసంగిస్తున్న సమయంలో జనాలను నియంత్రించడం కష్టతరంగా మారింది. ఈ క్రమంలో తొక్కిసలాటకు దారితీసింది.
ఈ దుర్ఘటనపై డీఎంకే తీవ్రంగా స్పందించింది. ఆ పార్టీ అధికార ప్రతినిధి శరవణన్ అన్నాదురై.. విజయ్ పై సంచలన ఆరోపణలు చేశారు. తొక్కిసలాట ఈ కార్యక్రమ నిర్వాహకుల ఉద్దేశపూర్వక కుట్ర అని ఆరోపించారు. ఒక నిర్దిష్ట సమయంలో సభ ప్రారంభం కావాల్సి ఉన్నా అది జరగలేదన్నారు. జనం విజయ్ కోసం దాదాపు 6 గంటలు వేచి ఉన్నారని తెలిపారు. జనాలను సమీకరించడానికే విజయ్ ఇలా చేశాడని అన్నారు. ఇది నిర్వాహాకుల చౌకబారు కుట్ర. ఇందులో వారి నేరపూరిత నిర్లక్ష్యం ఉందని ఆయన ఆరోపించారు. ఈ దుర్ఘటనకు బాధ్యులైన వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. మిస్టర్ విజయ్ దోషి. అతను నేరం నుండి తప్పించుకోలేడు అని తేల్చి చెప్పారు శరవణన్.
శనివారం మధ్యాహ్నమే ప్రచార సభ ప్రారంభం కావాల్సి ఉంది. కానీ విజయ్ చాలా లేటుగా వచ్చారు. అసలే ఇరుకైన ప్రాంతం కావడం, జనాలు భారీగా తరలి రావడంతో తొక్కిసలాట జరిగింది. విజయ్ సభకు 10వేల వస్తారని టీవీకే నేతలు అంచనా వేశారు. అయితే, అనూహ్యంగా 50వేల మంది జనం వచ్చేశారు.