చేప కొరకడంతో చేతి వేలిపై చిన్న గాయం.. ప్రాణాలు పోతాయని అరచెయ్యి తీసేసిన వైద్యులు.. అసలేం జరిగిందంటే?
చేప కొరికితే ఏం అవుతుందిలే అనుకుంటాం. కానీ, కేరళ రాష్ట్రంలోని ఓ వ్యక్తిని చేప కొరకడం వల్ల అరచేతిని కోల్పోవాల్సి వచ్చింది.

Fish attack
Fish Attack man in Kerala: చేప కొరికితే ఏం అవుతుందిలే అనుకుంటాం. కానీ, కొన్ని రకాల చేపలు కొరకడం వల్ల ఇన్ఫెక్షన్ సోకి ప్రాణాలకే ముప్పు వస్తుంది. ఇలాంటి ఘటన కేరళ రాష్ట్రంలో చోటు చేసుకుంది. చేప కొరికిన కారణంగా ఓ రైతు అరచేతిని కోల్పోవాల్సిన పరిస్థితి తలెత్తింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
కన్నూర్ జిల్లాలోని తలస్సెరికి చెందిన టి. రాజేశ్ (38) అనే వ్యక్తి గత నెలలో తన పొలంలో చెరువును శుభ్రం చేస్తున్నాడు. ఆ సమయంలో ‘కడు’ అనే రకం చేప కొరకడంతో అతడి కుడి చేతివేలిపై చిన్నపాటి గాయమైంది. అయితే, దాన్ని అతడు పెద్దగా పట్టించుకోలేదు. రెండు రోజులకే చిన్నగాయం కాస్త పెద్దదిగా అవుతుండటంతో స్థానికంగా కొడియేరిలో ఉన్న ప్రాథమిక ఆస్పత్రికి వెళ్లాడు. అక్కడి వైద్యులు టెటనస్ ఇంజెక్షన్ ఇచ్చినట్లు తెలిపాడు. అయితే, ఆ గాయం తగ్గకపోగా.. కొద్దిరోజుల తరువాత అరచేతిపై బొబ్బలు వచ్చాయి.
అర చేతిపై బొబ్బలు రావడంతో మెరుగైన చికిత్స కోసం రాజేశ్ కోజికోడ్ లోని ఓ ఆస్పత్రి వైద్యులను సంప్రదించాడు. వైద్యులు అతనికి పలు రకాల పరీక్షలు నిర్వహించారు. ‘గ్యాస్ గ్యాంగ్రీన్’ అనే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ సోకినట్లు నిర్ధారణకు వచ్చారు. ఈ ఇన్ఫెక్షన్ నుంచి బయటపడాలంటే ప్రస్తుతం ఇన్ఫెక్షన్ సోకిన భాగం వరకు తొలగించాలని వైద్యులు సూచించారు. అంతకు మించి మరో మార్గం లేదని, ఒకవేళ ఇన్ఫెక్షన్ సోకిన భాగాన్ని అలానే ఉంచితే అది మెదడుకు వ్యాపిస్తే ప్రాణాలకే ప్రమాదం ఉంటుందని వైద్యులు పేర్కొన్నారు. దీంతో తొలుత చేతివేళ్లను, ఆ తరువాత పూర్తిగా అరచేతిని తొలగించారు.
ఇసుక, బురద నీటిలో కనిపించే క్లోస్ట్రిడియం పెర్పింజెన్స్ అనే బ్యాక్టీరియా వల్ల ఈ ఇన్ఫెక్షన్ వస్తుందని వైద్యులు వివరించారు. లక్ష మందిలో ఇద్దరికి మాత్రమే ఈ పరిస్థితి వస్తుందని వైద్యులు తెలిపారు. కేరళ రాష్ట్రంలో ఈ వ్యాధి సోకిన ఇద్దరు వ్యక్తుల్లో రాజేశ్ ఒకరు.