ఆరెంజ్ అలర్ట్ : కేరళలో కుంభవృష్టి..ఇబ్బందులు పడుతున్న ఓటర్లు

దేశంలోని పలు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే మూడు రోజుల్లో భారీ వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ సూచించింది. ప్రధానంగా కేరళ రాష్ట్రంలో వరుణుడు బీభత్సం సృష్టిస్తున్నాడు. అక్టోబర్ 21వ తేదీ సోమవారం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండి. బంగాళఖాతంలోని ఏర్పాడిన ఉపరితల ఆవర్తనం కారణంగా తమిళనాడు, కేరళలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తిరువనంతపురం, కొల్లామ్, కొట్టాయమ్, ఎర్నాకులం, మలప్పురం, కోజికోడ్, కన్నూరు తదితర జిల్లాల్లో కొద్దిగంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. రోడ్లపై భారీగా నీరు నిలవడంతో చెరువులను తలపిస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా కొచ్చిలోని పాఠశాలలకు అధికారులు సెలవు ప్రకటించారు.
అక్టోబర్ 21వ తేదీన కేరళలోని కొన్ని జిల్లాల్లో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. భారీ వర్షాలు కురుస్తుండడంతో ఓటింగ్‌పై ప్రభావం చూపెడుతోంది. ఓటర్లు ఓటు వేయడానికి బయటకు రాలేకపోతున్నారు. కొన్ని బూత్‌లలో వర్షపు నీరు చేరడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కేరళలో 5 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతోంది. 9.7 లక్షల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. తిరువనంతపురంలోని వట్టియూర్కావు, ఆలప్పుజలోని ఆరూర్, పత్నంతిట్టతో పాటు ఎర్నాకుళం, మాంజేశ్వరం స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మాంజేశ్వరం మినహా నాలుగు స్థానాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
ప్రధానంగా ఎర్నకులం జిల్లాపై ప్రభావం చూపింది. జనజీవనం స్తంభించింది. ట్రైన్, బస్సుల రాకపోకలకు అంతరాయం కలగడంతో ప్రయాణీకులు అవస్థలు పడ్డారు. పట్టాలపై నీరు చేరడంతో కొన్ని రైళ్లు ఆలస్యంగా నడుస్తుండగా..మరికొన్ని రైళ్లను అధికారులు రద్దు చేశారు. కోచిలో రికార్డుస్థాయిలో వర్షం కురుస్తోంది. 80 మి.మీటర్ల వర్షం కురిసిందని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలోని జలాశయాలు పూర్తిస్థాయిలో నిండుతున్నాయి. దీంతో అదనపు జలాలను దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడుతున్నాయి.
Read More : తీహార్ జైలుకు వెళ్లిన కుమార స్వామి