Kerala Ministers list : విజయన్ 2.0 మంత్రివర్గంలో మొత్తం కొత్తవాళ్లే..అల్లుడికి అందలం

ఇటీవల జరిగిన కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం పిన్నరయి విజయన్ నేతృత్వంలోని ఎల్డీఎఫ్ కూటమి మరోసారి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.

Kerala Ministers list : విజయన్ 2.0 మంత్రివర్గంలో మొత్తం కొత్తవాళ్లే..అల్లుడికి అందలం

Cm Vijayan Son In Law

Updated On : May 18, 2021 / 8:42 PM IST

Kerala Ministers list ఇటీవల జరిగిన కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం పిన్నరయి విజయన్ నేతృత్వంలోని ఎల్డీఎఫ్ కూటమి మరోసారి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో కేరళలో ఇప్పటివరకు కొత్త సర్కార్ కొలువుదీరలేదు. మే-20న సీఎం మినహా 11మందితో కేరళ కొత్త మంత్రివర్గం కొలువుదీరనుంది. తిరువనంతపురంలోని సెంట్రల్ స్టేడియంలో సీఎంగా పిన్నరయి విజయన్ మరోసారి ప్రమాణస్వీకారం చేయనున్నారు.

మంగళవారం(మే-18,2021) సీపీఐ(M)రాష్ట్ర కమిటీ..తమ పార్లమెంటరీ పార్టీ నేత,రాష్ట్ర ముఖ్యమంత్రిగా పిన్నరయి విజయన్ ను ఎన్నుకొంది. అయితే ఈ సందర్భంగా సీపీఎం సంచలన నిర్ణయం తీసుకుంది. అభ్యర్థులను ఎంపిక చేసే ప్రక్రియలో అనుసరించే.. ‘కొత్త తరానికి అవకాశం’ వ్యూహాన్నే ఇక్కడా అమలుచేసింది సీపీఎం. పినరయి విజయన్ మినహా నూతన కేబినెట్​లో పాతవాళ్లెవరికీ చోటు కల్పించకూడదని నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని కొడియేరి బాలకృష్ణణ్ ప్రతిపాదించారు. దీంతో కేరళలో వరుసగా రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోన్న సీఎం పినరయి విజయన్.. పూర్తిగా నూతన మంత్రివర్గంతో రానున్నారు. సీపీఎం నిర్ణయంతో..గతంలో మంత్రులుగా పనిచేసిన ఎవరికీ ఈ దఫా కేబినెట్​లో చోటుదక్కలేదు.


కొత్త కేబినెట్

కేరళలో మొత్తం 20 కేబినెట్ బెర్తులు ఉండగా, ఎల్డీఎఫ్ కూటమిలో అతిపెద్ద పార్టీ సీపీఎంకు 12, సీపీఐ 4, కేరళ మణి కాంగ్రెస్, జేడీఎస్ లకు చెరో మంత్రి పదవి, మిగిలిన నాలుగు చిన్న పార్టీలకు రొటేషన్ పద్ధతిపై రెండు మంత్రి పదవులు పంచుకోనున్నారు. సీపీఎం నుంచి మంత్రి పదవులు దక్కినవారిలో… ఎంవీ గోవిందన్, కే రాధాకృష్ణన్, కేఎన్ బాలగోపాల్, పి.రాజీవ్, వీఎన్ వాసవన్, సజి చేరియన్, వి.శివన్ కుట్టి, మొహ్మద్ రియాజ్, ఆర్.బిందు, వీణా జార్జ్, వి.అబ్దు రహవాన్ లు ఉన్నారు. సీపీఐ నుంచి.. ప్రసాద్, రాజన్, చించురాణి, జీఆర్ అనిల్​కు కేబినెట్ లో చోటుదక్కింది. కీలకమైన అసెంబ్లీ స్పీకర్ పదవిని కూడా సీపీఎం తీసుకుంది. పాలక్కాడ్ మాజీ ఎంపీ, ప్రస్తుతం థ్రితల నుంచి ఎమ్మెల్యేగా ఉన్న ఎంబీ రాజేశ్ ను అసెంబ్లీ స్పీకర్ గా ఎంపిక చేశారు.

అయితే కొత్తగా మంత్రి పదవులు పొందినవారిలో మొహ్మద్ రియాజ్ పేరు అందరినీ ఆకర్షించడంతోపాటు సదరు నిర్ణయం సంచలనంగానూ మారింది. ఎందుకంటే మొహ్మద్ రియాజ్.. ముఖ్యమంత్రి పినరయి విజయన్ అల్లుడు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో మొహ్మద్ రియాజ్(44) కోజికోడ్‌ జిల్లా బేపోర్‌ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. విజయన్‌ కూతురు వీణ, రియాజ్ 2020లో వివాహం చేసుకున్నారు. వీరిద్దరికీ ఇది రెండో వివాహం. అందరూ కొత్తవాళ్లనే మంత్రులుగా నియమించుకోవాలని సీఎం విజయన్ భావించడంతో అల్లుడికి అవకాశం దక్కింది. కరోనా కట్టడి చర్యలతో అంతర్జాతీయంగా ప్రశంసలందుకున్న ఆరోగ్య మంత్రి కేకే శైలజ శైలజ ఒక్కరినైనా కొనసాగించాల్సిందిగా పార్టీ హైకమాండ్ నుంచి వత్తిడి వచ్చినా విజయన్ ఖాతరు చేయలేదు. కరోనా సమయంలో బాగా పనిచేసినందుకు శైలజ ఒక్కదానికి మినహాయింపు ఇవ్వడం సరికాదని సీఎం కరాకండిగా చెప్పడంతో బృందా కారత్ లాంటి నేతలూ ప్రయత్నాలు విరమించుకున్నారు. కాగా, పార్లమెంటరీ సెక్రటరీ హోదాలో శైలజకు ప్రభుత్వ విప్ పదవిని కట్టబెట్టారు.