ట్రాఫిక్ జరిమానాలు సగానికి సగం తగ్గించిన ప్రభుత్వం

కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన కొత్త మోటారు వెహికల్ యాక్ట్ లో ప్రకటించిన జరిమానాలను తగ్గించాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించింది. అక్టోబరు 23, బుధవారంనాడు సమావేశమైన కేబినెట్ మీటింగ్ లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. కాగా.. మద్యం తాగి వాహానం నడిపితే విధించే 10 వేల రూపాయల జరిమానా మాత్రం యధాతధంగా ఉంచుతున్నారు.
హెల్మెట్ ధరించకపోయినా, సీటు బెల్టు పెట్టుకోకపోయినా విధించే జరిమానా రూ.1000 నుండి రూ.500కు తగ్గించారు. డ్రయివింగ్ చేస్తూ సెల్ ఫోన్ ఉపయోగిస్తే రూ.2000, అధిక వేగంతో వాహనం నడిపితే జరిమానా మొదటి సందర్భంలో 1,500 రూపాయలు మరియు అదే తప్పు తిరిగి చేస్తే 3,000 రూపాయలు చెల్లించాలి. కాగా సరుకు రవాణా వాహనాలు ఓవర్ లోడింగ్ తో వెళ్తే విధించే జరిమానా సగానికి సగం తగ్గించారు. కేంద్రం 20 వేల రూపాయలు నిర్ణయించగా ఆ జరిమానాను రూ.10 వేల కు తగ్గించారు.
సెప్టెంబరు నెలలో సీఎం పినరయి విజయన్ ఇచ్చిన ఆదేశాల మేరకు జరిమానాల తగ్గింపు చేసినట్లు రవాణా శాఖ మంత్రి ఏకే శశీంద్రన్ చెప్పారు. సవరించిన చట్టం ప్రకారం జరిమానాలు ఖరారు చేయటానికి ముసాయిదాను కేంద్ర రహాదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి లేఖ రాయాలని కేబినెట్ నిర్ణయించింది. రాష్ట్ర ఎంపీలు కూడా ఈవిషయంలో జోక్యం చేసుకుని కేంద్రంతో మాట్లాడాలని సీఎం సూచించారు.
కేంద్రం కొత్త వాహాన చట్టాని ప్రకటించిన వెంటనే బీజేపీయేతర ప్రభుత్వాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలు రేట్లు తగ్గిస్తామని ప్రకటించాయి. గత కొన్నివారాల్లో అనేక రాష్ట్రాలు మద్యం తాగి వాహనం నడిపితే విధించే జరిమానా మినహా మిగతా జరిమానాలను భారీగా తగ్గించాయి. కేరళ కూడా ఇప్పుడువాటి సరసన చేరింది.