Railway stations: రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. కన్ఫాం టికెట్లు ఉంటేనే ఈ 60 రైల్వే స్టేషన్లలోకి ఎంట్రీ.. లేకపోతే..
సాధారణంగా రైల్వేస్టేషన్లలో పండుగల వంటి సమయాల్లో రద్దీ అధికంగా ఉంటుంది.

Railway platforms
రైల్వే స్టేషన్లలో రైళ్లు ఎక్కేవారే కాకుండా వారి బంధువులు, మిత్రులు చాలా మంది వస్తుంటారు. దీంతో రైల్వేస్టేషన్లు అన్నీ కిక్కిరిసిపోతుంటాయి. దీంతో అనవసరపు రద్దీని నివారించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు వేసుకుంటోంది.
రైల్వే ప్లాట్‌ఫాంల వద్ద రద్దీని నివారించడానికి బెంగళూరు సహా 60 బిజీ స్టేషన్లలో కన్ఫార్మ్డ్ టికెట్లు ఉన్న ప్రయాణీకులను మాత్రమే అనుమతించాలని భారతీయ రైల్వే నిర్ణయించింది. ఉన్నతాధికారులతో తాజాగా రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సమావేశం నిర్వహించారు.
దేశంలోని ప్రధాన స్టేషన్లలో క్రౌడ్ కంట్రోల్ చర్యలను అమలు చేయబోతున్నట్లు ప్రకటించారు. ఇవిగాక మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 60 స్టేషన్ల వద్ద ప్రయాణికుల కోసం పర్మినెంట్ వెయిటింగ్ ఏరియాను రైల్వే శాఖ నిర్మించనుంది. కన్ఫార్మ్డ్ రిజర్వ్ టికెట్లు ఉన్న ప్రయాణీకులను మాత్రమే ప్లాట్‌ఫాంలలోకి పంపుతారు.
టికెట్ లేనివారు లేదా వెయిటింగ్ లిస్ట్ టికెట్ ఉన్నవారు వెయిటింగ్ ఏరియాలోనే వేచి ఉండాల్సి ఉంటుంది. స్టేషన్లలో అన్ని అనధికార ఎంట్రీ పాయింట్లను మూసివేస్తారు. ఢిల్లీ, ఆనంద్ విహార్, వారణాసి, అయోధ్య, పట్నా స్టేషన్లలో యాక్సెస్ కంట్రోల్ పైలట్ ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయి.
ఈ కాన్సెప్ట్‌తో ప్రయాణికులు వెయిటింగ్ ఏరియాలో ఉంటారని, రైళ్లు వచ్చినప్పుడు మాత్రమే ప్రయాణీకులకు ప్లాట్‌ఫాంకు వెళ్లడానికి అనుమతి ఉంటుందని అధికారులు తెలిపారు. కాగా, ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో 18 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఆ ఘటన చోటుచేసుకుని నెలరోజులు అవుతుంది. రైల్వే శాఖ ఈ సమయంలో ప్రయాణికుల రద్దీని నివారించడానికి ఈ కీలక నిర్ణయాలు తీసుకోవడం గమనార్హం.
సాధారణంగా రైల్వేస్టేషన్లలో పండుగల వంటి సమయాల్లో రద్దీ అధికంగా ఉంటుంది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. తొక్కిసలాట భయం కూడా ఉంటుంది. వీటన్నింటికీ చెక్ పెట్టాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.