అక్కకు తోడుగా : ఒక్కటైన అన్నదమ్ములు

కొన్ని రోజులుగా ఉప్పు,నిప్పులా ఉన్న ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ కుమారులు తేజ్ ప్రతాప్ యాదవ్,తేజ్వీ యాదవ్ లు ఇప్పుడు ఒక్కటయ్యారు. అక్క మీసా భారతి విజయం కోసం ఇద్దరు అన్నదమ్ములు ఒకే వేదికను పంచుకున్నారు. ఆదివారం బీహార్‌లో జరిగిన ప్రచారంలో అన్నదమ్ములు ఓ వేదికపై పక్కపక్కనే కూర్చున్నారు. సోదరుడు తేజస్వి అంటే తనకు ఇష్టమని, అతను అర్జునుడి లాంటివాడని తేజ్ ప్రతాప్ యాదవ్ తెలిపారు. ఆర్జేడీ పార్టీని వీడి ఇటీవల తేజ్ ప్రతాప్ వెళ్లిపోయారు. కొన్ని చోట్ల అతను ఆర్జేడీకి వ్యతిరేకంగా ప్రచారం చేశాడు. కానీ సోదరి మీసా భారతి కోసం మాత్రం తల్లి రబ్రీదేవితో కలిసి తేజ్ ప్రతాప్ ప్రచారం చేస్తున్నాడు. పాటలీపుత్ర నుంచి మీసా భారతి పోటీ చేస్తున్నారు. ఇదే నియోజకవర్గం నుంచి 2009లో లాలూ ప్రసాద్ ఓటమిపాలయ్యారు. ప్రస్తుతం ఈ స్థానం నుంచి బీజేపీ తరపున సిట్టింగ్ ఎంపీ, కేంద్ర మంత్రి రామ్ క్రిపాల్ యాదవ్ మరోసారి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.