ఠాక్రే విశ్వాస పరీక్ష నేడే

ఠాక్రే విశ్వాస పరీక్ష నేడే

Updated On : November 30, 2019 / 1:42 AM IST

మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే ప్రభుత్వం నేడు(శనివారం) అసెంబ్లీలో విశ్వాస పరీక్ష ఎదుర్కోనుంది. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ల కూటమి ‘మహా వికాస్‌ అఘాడి’ తాజాగా మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. గవర్నర్‌ భగత్‌ సింగ్‌ కోశ్యారీ అసెంబ్లీలో బలనిరూపణకు ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రేకు డిసెంబర్‌ 3 వరకు గడువు ఇచ్చారు. ఈ మేర శనివారమే మెజారిటీని నిరూపించుకునేందుకు ఉద్ధవ్‌ ఠాక్రే రెడీ అయ్యారు. నవంబర్‌ 30న మధ్యాహ్నం విశ్వాస పరీక్షను ఎదుర్కోనున్నట్లు అసెంబ్లీ అధికారులు వెల్లడించారు.

ఎన్‌సీపీ ఎమ్మెల్యే దిలీప్‌ వాల్సే పాటిల్‌ను కొత్త ప్రొటెం స్పీకర్‌గా నియమించారు. ప్రొటెం స్పీకర్‌ కాళిదాసు కొలాంబ్కర్‌ స్థానంలో పాటిల్‌ బాధ్యతలు తీసుకున్నారు. ఏడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన దిలీప్‌ పాటిల్‌ గతంలో అసెంబ్లీ స్పీకర్‌గా పనిచేశారు. ఉద్ధవ్‌ ఠాక్రే శుక్రవారం లాంఛనంగా అధికార బాధ్యతలు చేపట్టారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన 56, ఎన్సీపీ 54, కాంగ్రెస్‌ 44 స్థానాలు గెలుచుకున్న విషయం తెలిసిందే. మొత్తం 288 సీట్లలో మెజారిటీకి అవసరమైన ఎమ్మెల్యేల సంఖ్య 145. ఎన్నికల్లో శివసేనతో కలిసి పోటీ చేసిన బీజేపీ 105 స్థానాల్లో గెలుపొందింది.

ఈ సందర్భంగా మహారాష్ట్ర తరువాత తదుపరి లక్ష్యం గోవాయేనని శివసేన నేత సంజయ్‌ రౌత్‌ ప్రకటించారు. గోవాలో కూడా బీజేపీయేతర సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుందన్నారు. మహారాష్ట్రవాది గోమంతక్‌ పార్టీ(ఎంజీపీ), గోవా ఫార్వర్డ్‌ పార్టీ(జీఎఫ్‌పీ) నేతలతో శుక్రవారం రౌత్‌ చర్చలు జరిపారు. ఈ రెండు పార్టీలు కూడా గతంలో బీజేపీ మిత్రపక్షాలే కావడం విశేషం.