లాక్‌డౌన్‌లో గుడ్ న్యూస్: గంగా నదిలో నీరు ఇప్పుడు తాగొచ్చు

కరోనా.. కోవిడ్-19 పేరు ఏదైనా మానవాళిని ఇంటికి పరిమితం చేసింది. అయితే దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కారణంగా పవిత్ర నగరమైన హరిద్వార్‌లోని హర్-కి-పౌరి వద్ద గంగా నది నీటి నాణ్యత పెరిగిందని, ఇప్పుడు అక్కడి నీరు ‘తాగడానికి సరిపోతుంది’ అని చెబుతున్నారు అధికారులు. ప్రతిష్టాత్మక పథకాలు వేలాది కోట్లు ఖర్చు పెట్టినా కూడా ప్రభుత్వం సంవత్సరాలుగా చేయలేకపోయిన పని లాక్‌డౌన్ కారణంగా పూర్తి అయ్యిందని అంటున్నారు.
పారిశ్రామిక కాలుష్య కారకాలు, చెత్త లేకపోవడం వల్ల స్వచ్ఛత స్థాయి గొప్పగా పెరిగింది అని, చాలాకాలం తరువాత గంగా నది నీటి నాణ్యత తాగే విధంగా మారిందని అంటున్నారు. దేశంలో దాదాపుగా అందరూ ఇళ్లకే పరిమితం కావడం.. వాతావరణంలో కాలుష్య స్థాయి అమాంతం తగ్గిందని, అడవుల్లో ఉండే మూగ జీవాలు స్వేచ్ఛగా రోడ్లపై తిరుగుతున్నాయని చెబుతున్నారు. నగరాల్లో ఇంటి పట్టున ఉండే ప్రజలందరికీ ట్రాఫిక్ రణగొణ ధ్వనుల నుంచి ఉపశమనం లభించింది. పర్యాటక స్వర్గధామాలుగా ప్రసిద్ధి చెందిన హరిద్వార్, రిషికేశ్‌లలో గంగా నది నీరు తాగడానికి అనుకూలంగా మారిపోయింది.
పారిశ్రామిక కాలుష్యం, ధర్మశాలలు, హోటళ్లు, లాడ్జీల నుండి వచ్చే మురుగునీరు 500 శాతం తగ్గడమే స్వచ్ఛమైన నీరుగా గంగ నీరు మారడానికి కారణం అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గంగా నది ఇంత శుభ్రంగా ఎప్పుడూ కనిపించలేదు అని చెబుతున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని గంగా నది నీటి నాణ్యత కూడా మెరుగుపడింది.
ఉత్తర ప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి (యుపిపిసిబి) ప్రకారం, ఆరోగ్యకరమైన నీరు కనీసం 7 మి.గ్రా / లీటరు కరిగిన ఆక్సిజన్ స్థాయిని కలిగి ఉండాలి. గంగా నదిలో కరిగిన ఆక్సిజన్ స్థాయి లీటరుకు 8.9 మి.గ్రా ఉండగా, దిగువ భాగంలో ఇది లీటరుకు 8.3 మి.గ్రా. నీటి నాణ్యత గణనీయంగా మెరుగుపడిందని మరియు స్నానం చేయడానికి ఇది సరైనదని చెప్తున్నారు.
లాక్‌డౌన్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి కాన్పూర్‌లో కూడా గంగ శుభ్రంగా మారింది. కాన్పూర్‌లోని ప్రసిద్ధ పర్మత్ ఆలయ పూజారి అజయ్ పూజారి మాట్లాడుతూ.. “కాన్పూర్‌లో నీటి కాలుష్యానికి ప్రధాన కారణం విషపూరిత పారిశ్రామిక వ్యర్థాలు నదిలో కలవడం అని, లాక్డౌన్ కారణంగా అన్ని కర్మాగారాలు మూసివయడంతో గంగా నది శుభ్రంగా మారిందని అన్నారు.