మే 3 తర్వాత లాక్‌డౌన్ ఆంక్షల్లో మార్పులు ఉంటాయా?

మే 3 తర్వాత లాక్‌డౌన్ ఆంక్షల్లో మార్పులు ఉంటాయా?

Updated On : June 23, 2021 / 12:57 PM IST

కరోనా వ్యాప్తితో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ఆంక్షలతో మే 3 వరకు కొనసాగనుంది. ఆ తర్వాత లాక్ డౌన్ కొనసాగింపులో కొన్ని సడలింపులు ఉండే అవకాశం ఉంది. వైరస్ ప్రభావ ప్రాంతాలను బట్టి సడలింపులు ఉండనున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో మాత్రం మే 7 వరకు పూర్తి స్థాయి లాక్ డౌన్ అమల్లో ఉండనుంది. రెడ్ జోన్లలో పూర్తిగా అమల్లో ఉంటుంది. మిగిలిన ప్రాంతాల్లో పాక్షిక లౌక్ డౌన్ అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.

ఆరెంజ్, గ్రీన్ జోన్లలో సమీప ప్రాంతాల్లోని ఆఫీసులు, షాపులు, పరిశ్రమలను అనుమతించనుంది. ఆర్థిక కార్యకలాపాలు కొనసాగించేందుకు వీలుగా అవకాశం కల్పించాలని కేంద్రం భావిస్తోంది. రెడ్ జోన్లలో అన్ని కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోతాయి. మిగతా జోన్లలో మాత్రం స్కూల్స్, కాలేజీలు, సినిమా థియేటర్లు, షాపింగ్ మాల్స్, ప్రార్థన ప్రదేశాల మూసివేత కొనసాగుతుంది. మత, రాజకీయ, క్రీడా కార్యకలాపాలపైనా నిషేధం అమల్లో ఉంటుంది. బస్సులు, రైళ్లు, విమానాల రాకపోకలపై కూడా నిషేధం వర్తిస్తుంది. ఇతర ఆర్థిక వ్యవహారాలన్నీ కేంద్ర, ఆరోగ్య శాఖ జారీ చేసిన మార్గదర్శకాలకు లోబడి అనుమతించాల్సి ఉంటుంది.

వ్యక్తిగత వాహనాలపై వెళ్లి పనిచేసుకునే వారికి కూడా ఇందులో మినహాయింపును కల్పిస్తోంది. సంస్థలు ఏర్పాటు చేసే వాహనాల్లో సామాజిక దూరం పాటిస్తూ రాకపోకలు సాగించేలా అవకాశం ఇవ్వనున్నారు. ఆర్థిక కార్యకలాపాలను నడుపుతూనే కరోనా వైరస్ పై పోరాటం చేసేందుకు అవసరమైన చర్యలపై కేబినెట్‌లో చర్చించిన తర్వాతే పూర్తి స్థాయిలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.