BJP Manifesto Release : బీజేపీ మ్యానిఫెస్టోను విడుదల చేసిన ప్రధాని నరేంద్ర మోదీ.. పార్టీ అగ్రనేతలు

ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్ లు బీజేపీ మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో పాల్గొన్నారు.

BJP Manifesto Release : బీజేపీ మ్యానిఫెస్టోను విడుదల చేసిన ప్రధాని నరేంద్ర మోదీ.. పార్టీ అగ్రనేతలు

BJP Manifesto Release

Lok Sabha Election 2024 BJP Manifesto : లోక్ సభ ఎన్నికల వేళ భారతీయ జనతా పార్టీ (BJP) మ్యాని ఫెస్టో ను విడుదల చేసింది. ఆదివారం ఉదయం ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్ లు పాల్గొని సంకల్ప్ పత్ర పేరుతో మ్యానిఫెస్టోను విడుదల చేశారు. మోదీ గ్యారెంటీ, 2047 నాటికి వికసిత భారత్ నినాదంతో సంకల్ప్ పత్రను విడుదల చేశారు.  రానున్న ఐదేళ్లలో బీజేపీ అధికారంలోకి వస్తే చేపట్టే కార్యక్రమాలు, 2047 నాటికి భారత్ ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు చేయాల్సిన రోడ్ మ్యాప్ అంశాలను మేనిఫెస్టో లో బీజేపీ పొందుపర్చింది. దేశ అభివృద్ధి, సంక్షేమం, దేశ రక్షణ, యువత, మహిళలు, రైతులకు, పేదలకు మేనిఫెస్టో లో బీజేపీ ప్రాధాన్యతను ఇచ్చింది.

Also Read : వికసిత్ భారత్ థీమ్‌తో బీజేపీ మ్యానిఫెస్టో.. హామీలపై సర్వత్రా ఉత్కంఠ

మ్యానిఫెస్టో విడుదల కార్యక్రమంలో జేపీ నడ్డా మాట్లాడుతూ.. ఇవాళ భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి అని, ఆయనకు మా నివాళులర్పిస్తున్నామని చెప్పారు. అంబేద్కర్ సామాజిక న్యాయంకోసం పోరాడారని, ఆయన చూపిన బాటలోనే బీజేపీ కూడా సామాజిక న్యాయంకోసం నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు.ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో పదేళ్లుగా దేశం అభివృద్ధిలో పరుగులు తీస్తోందని అన్నారు. అయోధ్యలో రామాలయ స్వప్నాన్ని సాకారం చేశాం, ట్రిపుల్ తలాక్, ఆర్టికల్ 370ని రద్దు చేశాం. 80కోట్ల మందికి ఉచితంగా రేషన్ ఇస్తున్నామని జేపీ నడ్డా చెప్పారు.

 

  • బీజేపీ మ్యానిఫెస్టో విడుదల అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు.
  • రాజ్ నాథ్ సింగ్ బృందంకు అభినందనలు. ఆయన బృందం ఉత్తమమైన మ్యానిఫెస్టోను తయారు చేసింది.
  • అభివృద్ధి చెందిన భారతదేశం నాలుగు స్తంభాలపై ఆధారపడిందని, ఇందులో యువత, రైతులు, పేదలు, మహిళలు ఉన్నారని మోదీ తెలిపారు.
  • బీజేపీ మేనిఫెస్టో కోసం దేశం మొత్తం ఎదురుచూస్తోంది. దీనికి వెనుక కారణం కూడా ఉంది. అదేమిటంటే గత పది సంవత్సరాలలో బీజేపీ తన మ్యానిఫెస్టోలోని ప్రతి అంశాన్ని క్షేత్రస్థాయిలో హామీగా అమలు చేసిందని మోదీ చెప్పారు.
  • వచ్చే ఐదేళ్లపాటు ఉచిత రేషన్ పథకం కొనసాగుతుందని మోదీ హామీ ఇచ్చారు.
  • పెట్టుబడి ద్వారా గౌరవమైన జీవితం, ప్రజలకు నాణ్యమైన జీవనాన్ని అందించేందుకు, ఉద్యోగాల కల్పనపై మా దృష్టి ఉందని చెప్పారు.
  • 70ఏళ్లు పైబడిన ప్రతి వ్యక్తి ఆయుష్మాన్ భారత్ పథకం కిందకు వస్తారని మోదీ చెప్పారు.
  • పేద, మధ్య తరగతి వర్గాల ప్రజల్లో వృద్ధుల ఆరోగ్యంపై ఆందోళన ఉందని, 70ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరినీ ఆయుష్మాన్ భారత్ పథకం పరిధిలోకి తీసుకురావాలని బీజేపీ తీర్మానించిందని మోదీ చెప్పారు.
  • విద్యుత్ బిల్లును సున్నాకు తగ్గించే ప్రయత్నం జరుగుతుందని మోదీ అన్నారు.
  • కోట్లాది కుటుంబాల్లో విద్యుత్ బిల్లును జీరోకు తగ్గించి, విద్యుత్ తో ఉపాధి అవకాశాలను కల్పించేందుకు కృషి చేస్తామని మోదీ చెప్పారు. ఇందులో భాగంగా ప్రధానమంత్రి సూర్య ఘర్ ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేస్తామని మోదీ అన్నారు.
  • గత కొన్నేళ్లుగా ముద్రా యోజన కోట్లాది మందిని పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దిందని మోదీ అన్నారు. ముద్ర యోజన పథకం కింద రూ. 10లక్షలు వరకు రుణం ఇచ్చాం. ఇప్పుడు ఆ పరిమితిని రూ. 20లక్షలకు పెంచుతూ బీజేపీ నిర్ణయం తీసుకుందని మోదీ చెప్పారు.
  • ఆయుష్మాన్ భారత్ పథకం పరిధిలోకి ట్రాన్స్ జెండర్ లను చేర్చాలని బీజేపీ నిర్ణయించిందని మోదీ అన్నారు.
  • బీజేపీ ప్రభుత్వం పేదలకోసం నాలుగు కోట్ల పక్కా ఇళ్లు నిర్మించిందని ప్రధాని చెప్పారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అందుతున్న అదనపు సమాచారాన్ని దృష్టిలో ఉంచుకొని మరో 3కోట్ల ఇళ్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చి ముందుకు సాగుతామని మోదీ అన్నారు.
  • ఇప్పటి వరకు ప్రతి ఇంటికి తక్కువ ధరకే సిలిండర్లు పంపిణీ చేశామని, రాబోయే కాలంలో ప్రతి ఇంటికి చౌకైన పైపులతో కూడిన గ్యాస్ ను అందించేందుకు వేగంగా కృషి చేస్తామని మోదీ చెప్పారు.
  • పదేళ్ల బీజేపీ హయాంలో 25కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారని, పేదల అభివృద్ధి పట్ల బీజేపీకి ఉన్న దృఢ నిబ్దతకు ఇది నిదర్శనం అని మోదీ అన్నారు.
  • పీఎం కిసాన్ సమ్మన్ నిధి కొనసాగుతుంది.
  • కూరగాయల ఉత్పత్తి చేసే వారికి క్లస్టర్లు ఏర్పాటు చేస్తాం.
  • చిన్న రైతులకు లబ్ధి కలిగేలా శ్రీఅన్న్ రకం వరిసాగుకు ప్రోత్సాహం.
  • సముద్ర నాచు, ముత్యాల సాగుకు ప్రోత్సాహం
  • తిరవల్లూరు కల్చరల్ సెంటర్ ఏర్పాటు చేస్తాం.
  • తమిళ భాషకు ప్రాధాన్యత కల్పిస్తాం.
  • స్వచ్ఛ భారత్, అత్యుత్తమ శిక్షణ, క్రీడా వికాసం, సంతులిత అభివృద్ధి లక్ష్యమని మోదీ చెప్పారు.
  • ఫుడ్ ప్రాసెసింగ్ హబ్ గా భారత్ ను తయారు చేస్తాం.
  • నానో యూరియా వినియోగానికి ఊతమిస్తాం.
  • ప్రపంచ పర్యాటక కేంద్రంగా భారత్ ను అభివృద్ధి చేస్తాం.
  • గిరిజన ప్రాంతాల్లో పర్యాటక రంగానికి ప్రోత్సాహం అందిస్తాం.
  • బిర్సా ముండా 150వ జయంతి ఉత్సవాలను 2025లో జాతీయ స్థాయిలో నిర్వహించనున్నట్లు మోదీ తెలిపారు.
  • గిరిజన వారసత్వంపై పరిశోధనలను కూడా బీజేపీ ప్రోత్సహిస్తుందని, డిజిటల్ ట్రైబల్ ఆర్ట్ అకాడమీని ఏర్పాటు చేస్తామని మోదీ చెప్పారు.
  • దేశంలో అనేక చోట్ల శాటిలైట్ పట్టణాలు నిర్మిస్తున్నామని మోదీ చెప్పారు.
  • విమానయాన రంగాన్ని ప్రోత్సహించి లక్షల మందికి ఉపాది కల్పిస్తున్నాం.
  • త్వరలో వందే భారత్ స్లీపర్, వందే భారత్ మెట్రో రైళ్లు అందుబాటులోకి తీసుకొస్తాం.
  • దేశం నలుమూలలా బుల్లెట్ రైళ్లు తెస్తాం.
  • ముంబయి – అహ్మదాబాద్ బుల్లెట్ రైలు మార్గం పూర్తి కానుంది.
  • ఉత్తర, దక్షిణ, తూర్పు వైపు కూడా బుల్లెట్ రైలు మార్గాలు వేస్తాం.
  • ఈవీ (ఎలక్ట్రానిక్స్ మోటార్) మార్కెట్ శరవేగంగా దూసుకెళ్తోంది. గడిచిన పదేళ్లలో 17లక్షల వాహనాలు విక్రయాలు జరిగాయి.