భారత సైన్యంలో మహిళల పాత్ర కొత్తదేం కాదు!

సుప్రీంకోర్టు సోమవారం(ఫిబ్రవరీ 17, 2020)న భారత సైన్యంలో పనిచేస్తున్న మహిళా అధికారుల విషయంలో సంచలనాత్మక తీర్పును వెలువరించింది. వారికి మూడు నెలల్లో శాశ్వత కమిషన్ హోదా, కమాండింగ్ రోల్స్ ఇవ్వాల్సిందేనని, దానిపై ఉన్న నిషేధం ఎత్తివేయాలని స్పష్టం చేసింది. పురుషులతో సమానంగా మహిళలకు కూడా ఇందులో అవకాశం కల్పించాలని ఆదేశించింది. సామర్థ్యంపై ప్రభుత్వం తమ ఆలోచనా మార్చుకోవాలని సూచించింది.
అంతేకాదు పురుషుల లాగానే మహిళా అధికారులను కూడా చూడాలని కోర్టు తెలిపింది. పురుష ఉద్యోగులతో సమానంగా మహిళలకు కూడా అన్ని రకాల బెనిఫిట్స్ అందేలా చర్యలు తీసుకోవాలని తెలిపింది.
భారతసైన్యంలో మహిళల పాత్ర కొత్తేం కాదు…
భారతదేశ సైన్యంలో మహిళల అధికారుల పాత్ర 77ఏళ్ల నాటిది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ కు మహిళా శక్తిపై గట్టి నమ్మకం ఉండేది. ఇండిపెండెన్స్ కు ముందే నేతాజీ సుభాష్ చంద్రబోస్ మహిళలు కూడా తక్కువ కాదని,సైన్యంలో వారి పాత్ర కూడా ముఖ్యమని ఆజాద్ హిందు ఫౌజ్ లేదా నేషనల్ ఇండియన్ ఆర్మీ(NIA)లో మహిళా సైనికుల కోసం రాణి ఝాన్సీ రెజిమెంట్ ను ఏర్పాటు చేశారు. జులై 9, 1943 సింగపూర్ లో ఇండియన్ నేషనల్ ఆర్మీని (INA)ని స్థాపించారు.
భారత సాయుధ బలగాల్లో మహిళా అధికారుల నియామకాలు 1992లో ప్రారంభయ్యాయి. వైమానిక దళంలో పోరాట విధుల్లో వారికి అవకాశం కల్పిస్తున్నారు. చాలా మంది మహిళలు ఫైటర్ పైలెట్లుగా చేర్చుకున్నారు. గతసంవత్సరం 24ఏళ్ల యువతి నావికాదళానికి మొదటి మహిళా సముద్ర నిఘా పైలట్ అయ్యింది.
కానీ, సైన్యం మాత్రం ఇంకా మహిళలను పక్కనపెడుతూనే ఉంది. డాక్లర్లు, నర్సులు, ఇంజినీర్లు, అడ్మినిస్ట్రేటర్లు, న్యాయవాదుల వంటి పాత్రలకే వారిని పరిమితం చేస్తోంది. పోరాట క్షేత్రాల్లో గాయపడ్డ జవాన్లకు మహిళలు వైద్యం అందిస్తున్నారు. మహిళా అధికారులకు అర్హత, ర్యాంకును బట్టి సైన్యం 20 ఏళ్ల సర్వీసును కల్పిస్తోంది. గత ఏడాది నుంచి మహిళలను సైనిక పోలీసులుగా నియమించేందుకూ అనుమతిస్తోంది.