మానవత్వం చూపిన పోలీసులు.. దిక్కుతోచని బాలికకు దన్నుగా నిలిచిన ఖాకీలు.. హ్యాట్సాఫ్!

బంధువులెవరూ లేని ఓ బాలిక.. తన తండ్రి చనిపోవడంతో ఏం చేయాలో తెలియక, దిక్కుతోచని స్థితిలో సహాయం కోసం పోలీసులకు ఫోన్ చేసింది.

మానవత్వం చూపిన పోలీసులు.. దిక్కుతోచని బాలికకు దన్నుగా నిలిచిన ఖాకీలు.. హ్యాట్సాఫ్!

Updated On : May 28, 2024 / 1:56 PM IST

Lucknow police humanity: తన తండ్రి చనిపోవడంతో ఏం చేయాలో తెలియక ఓ బాలిక పోలీసులకు ఫోన్ చేసింది. తన తండ్రికి తాను తప్ప బంధులెవరూ లేరని, అంత్యక్రియలకు డబ్బులు కూడా లేవని చెప్పడంతో సదరు పోలీసులు ఆపన్న హస్తం అందించారు. దగ్గరుండీ బాలిక తండ్రి అంత్యక్రియలు జరిపించారు. అంత్యక్రియలకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేయడమే కాకుండా కాడి కూడా మోశారు. స్థానికుల సహాయంతో అంత్యక్రియలు పూర్తి చేశారు. ఉత్తరప్రదేశ్ లోని లక్నోలో ఈ ఉదంతం వెలుగు చూసింది. సిన్హా అనే వ్యక్తి దీనికి సంబంధించిన ఫొటోను ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

దిక్కుతోచని స్థితిలో ఉన్న బాలికకు మానవత్వంతో సహాయం చేసిన లక్నో పోలీసులపై సోషల్ మీడియాలో ప్రశంసలు కురుస్తున్నాయి. మంచిపని చేశారని మెచ్చుకుంటూ నెటిజనులు కామెంట్లు పెడుతున్నారు. యూపీ పోలీసులు ఇప్పుడు దేశంలోనే అత్యుత్తమ పోలీసులుగా నిలిచారంటూ కితాబిస్తున్నారు. మానవత్వంతో ఉత్తరప్రదేశ్ పోలీసులు స్పందించిన తీరు ప్రశంసనీయమని.. తమకు అన్ని విధాలుగా సహాయం చేయడానికి పోలీసులు సిద్ధంగా ఉన్నారనే నమ్మకాన్ని ప్రజల్లో పెంచేందుకు ఇలాంటివి దోహదం చేస్తాయంటున్నారు.

ఇలాంటి మంచి పనులు చేస్తే పోలీసులు గౌరవం మరింత పెరుగుతుందని కొంత మంది అభిప్రాయపడ్డారు. తండ్రిని కోల్పోయిన బాలిక వివరాలు చెబితే సహాయం అందిస్తామంటూ కొందరు ముందుకు వచ్చారు. ఆమెను ప్రభుత్వం ఆదుకోవాలని సోషల్ మీడియా ద్వారా విన్నవించారు. ఆమె చదువు పూర్తయి ఉద్యోగం వచ్చే వరకు అండగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను కోరారు.

Also Read: బాత్రూంలో ఒకేసారి 30 పాములు.. వణికిపోయిన స్థానికులు