రేపే బలపరీక్ష…కమల్ నాథ్ కు గవర్నర్ అల్టిమేటం

కమల్ నాథ్ ప్రభుత్వానికి మధ్యప్రదేశ్ గవర్నర్ షాక్ ఇచ్చారు. కరోనా వైరస్ దృష్యా మార్చి-26వరకు సభను వాయిదా వేస్తూ ఇవాళ ఉదయం అసెంబ్లీ స్పీకర్ ప్రకటించిన కొద్దిసేపటి తర్వాత…మంగళవారం(మార్చి-17,2020)అసెంబ్లీలో బలపరీక్ష నిరూపించుకోవాలంటూ కమల్ నాథ్ సర్కార్ కు సూచించారు గవర్నర్ లాల్జీ టాండన్. ఈ మేరకు కమల్ నాథ్ కు గవర్నర్ ఓ లేఖ రాశారు. మార్చి-17,2020లోగా బలపరీక్షను మీకు ఎదుర్కోకకపోతే…మీది మైనార్టీ ప్రభుత్వంగా భావించాల్సి ఉంటుంది అని ఆ లేఖలో గవర్నర్ తెలిపారు.
ఇవాళ ఉదయం మధ్యప్రదేశ్ బడ్జెట్ సెషన్ ప్రారంభ అయింది. గవర్నర్ తన ప్రసంగం యొక్క చివరి పేజీని మాత్రమే చదివి, “రాజ్యాంగాన్ని అనుసరించాలని” కాంగ్రెస్‌ను కోరిన తరువాత “సభను గౌరవించండి” అనే నినాదాల మధ్య అసెంబ్లీ నుండి బయటకు వెళ్లారు. “అందరూ రాజ్యాంగం ప్రకారం నిబంధనలను పాటించాలి, తద్వారా మధ్యప్రదేశ్ గౌరవం రక్షించబడుతుంద అని గవర్నర్ అన్నారు. మరోవైపు కమల్ నాథ్ సర్కార్ వెంటనే బలపరీక్షను నిర్వహించాలని కోరుతూ సుప్రీంలో బీజేపీ పిటిషన్ దాఖలు చేసింది. మంగళవారం ఈ పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ జరుపనుంది.
గత వారం కాంగ్రెస్ కు రాజీనామా చేసిన బీజేపీలో చేరిన జ్యోతిరాధిత్య సింధియా వర్గానికి చెందిన 21మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసి రెబల్స్ గా మారడంతో 15నెలల కమల్ నాథ్ సర్కార్ ఇప్పుడు క్లిష్ఠ పరిస్థితులు ఎదుర్కొంటోంది. గవర్నర్ ఆదేశించినట్లు కనుక రేపు బలపరీక్ష జరపితే అది బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగుమం అవుతుంది.
ఎందుకంటే ప్రస్తుతం ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ దగ్గర లేదు. తగిన సంఖ్యాబలం లేకుండా బలపరీక్షకు వెళ్లకూడదనే ఉద్దేశ్యంతోనే కరోనా వైరస్ దృష్యా మార్చి-26వరకు సభను వాయిదా వేయించింది కాంగ్రెస్. ఈ10రోజుల సమయంలో రాజీనామాలు చేసిన ఎమ్మెల్యేలను బుజ్జగించి తిరిగి తమదారికి తెచ్చుకుని ప్రభుత్వాన్ని కాపాడుకోవాలనేది కమల్ నాథ్ యోచన. అయితే కర్ణాటకలో జరిగినట్లు జరిగితే అతి త్వరలో మధ్యప్రదేశ్ లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం సృష్టంగా కనిపిస్తోంది.