మహారాష్ట్ర, హర్యానా శాసనసభ ఎన్నికల షెడ్యూల్ త్వరలో

మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ రెండు రాష్ట్రాల్లోనూ అక్టోబర్ 27వ తేదీ, దీపావళి పండుగకు ముందే ఎన్నికలు పూర్తి చేయాలని ఈసీ భావిస్తోందని తెలుస్తోంది. మహారాష్ట్ర అసెంబ్లీలోని 288 సీట్లు, హర్యానాలోని 90 అసెంబ్లీ స్థానాలకు ఒకటి, రెండ్రోజుల్లో నోటిఫికేషన్ వెలువడే అవకాశాలు ఉన్నాయి.
మహారాష్ట్ర, హర్యానా లతోపాటు ఢిల్లీ, జార్ఖండ్ అసెంబ్లీలకు కూడా ఎన్నికలు మరో నెల తర్వాత జరిపే యోచనలో ఈసీ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నాలుగు రాష్ట్రాలకు కలిపి ఒకే దఫా నోటిఫికేషన్ విడుదల చేస్తారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. కాగా జార్ఖండ్ అసెంబ్లీ పదవీ కాలం వచ్చే ఏడాది జనవరి 5వ తేదీతో, ఢిల్లీ అసెంబ్లీ ఫిబ్రవరి 22వ తేదీతో ముగుస్తుంది.
కాగా… మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల పంపకానికి సంబంధించి ఒకటి రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉందని శివసేన చీఫ్ ఉద్దవ్ ధాకరే తెలిపారు. ఎన్నికల్లో పొత్తు విషయమై శివసేన ఇప్పటికే ఒక రాజీ ఫార్ములాని బీజేపీ ముందు ఉంచింది. దాని ప్రకారం ప్రకారం రాష్ట్రంలో ఉన్న మొత్తం 288 సీట్లకు గాను శివసేన 135 సీట్లలో పోటీ చేస్తుంది. బీజేపీకి 153 సీట్లు ఇస్తుంది. అయితే బీజేపీకి కేటాయించిన సీట్లలో 18 సీట్లను కూటమిలోని చిన్న పార్టీలైన ఆర్పీఐ (అథవాలే), రాష్ట్రీయ సమాజ్ పక్ష, శివ సంగ్రామ్ పార్టీలకు కేటాయించాల్సి ఉంటుంది. ఆ లెక్కన శివసేన, బీజేపీ చెరో 135 సీట్లలో పోటీ చేయాల్సి ఉంటుంది. కాగా, ఒకవైపు సీట్ల పంపకంపై చర్చలు జరుపుతున్న శివసేన… ఇదే సమయంలో 2014లో మాదిరిగానే బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తే శివసేన శ్రేణులు ఒంటరి పోరాటానికి సిధ్దంగా ఉండాలని ఉధ్దవ్ ఠాక్రే ఇప్పటికే సూచించినట్లు తెలుస్తోంది.