ముదిరిన వివాదం: బీజేపీపై శివసేన సంచలన వ్యాఖ్యలు

ముఖ్యమంత్రి పదవిని చెరో రెండున్నరేళ్లు పంచుకోవాల్సిందే అని భీష్మించుకు కూర్చుంది శివసేన. ఒకే వ్యక్తి ముఖ్యమంత్రి పదవిలో పాతుకుపోవడం సరికాదంటూ గట్టిగానే బీజేపీకి వ్యతిరేకంగా పావులు కదుపుతుంది. శివసేన కార్యకర్తల సమావేశంలో ఆ పార్టీ చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే కూడా ఈ మేరకు సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ క్రమంలోనే లేటెస్ట్‌గా తలబిరుసు తగ్గించుకోవాలంటూ బీజేపీని హెచ్చరించింది శివసేన. శివసేనకు చెందిన వ్యక్తే మహారాష్ట్ర సీఎం అవుతారంటూ ఆ పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మాహారాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
ప్రభుత్వం ఏర్పాటు విషయంలో ఇప్పటివరకు బీజేపీతో చర్చించలేదని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకుంటే సంఖ్యా బలాన్ని సమకూర్చుకోగలమని ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీకి సంఖ్యా బలం ఉంటే ప్రభుత్వం ఏర్పాటు చేసి బలాన్ని నిరూపించుకోవాలని సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు తమ భాగస్వామ్యానికి అని, అయితే ఫలితాలు వచ్చినరోజు నుంచి బీజేపీ ఎందుకు చర్చలకు రావట్లేదని ప్రశ్నించారు సంజయ్ రౌత్. ఇదిలా ఉంటే సంజయ్ రౌత్ ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌ను కూడా కలిశారు. దీపావళి శుభాకాంక్షలు తెలిపేందుకే కలిశానని సంజయ్ చెప్పినప్పటికీ తాజా రాజకీయాలపై చర్చించినట్లు తెలిసింది.