నువ్వు గ్రేట్ : మోడీకి ఓటు వేయాలని ఆస్ట్రేలియా ఉద్యోగం వదిలేశాడు

నువ్వు గ్రేట్ : మోడీకి ఓటు వేయాలని ఆస్ట్రేలియా ఉద్యోగం వదిలేశాడు

కర్ణాటకలో పర్యటించిన నరేంద్ర మోడీ.. శనివారం నెహ్రూ మైదానంలో నిర్వహించిన సమావేశం విజయవంతంగా ముగిసింది. అంతేకాదు ఆ మీటింగ్ విన్న తర్వాత మోడీపై అభిమానం పెరిగిపోయిన మంగళూరు వ్యక్తి ఓటేసేందుకు ఆస్ట్రేలియా జాబ్‌ను కూడా వదిలి వచ్చేశాడు. రెండో సారి తన అభిమాన నాయకుడ్ని గెలిపించి ప్రధానిని చేయాలనే తపనతో బంగారంలాంటి జాబ్‌ను తృణప్రాయంగా వదిలేసినట్లు చెప్పుకొచ్చాడు. 

సుధీంద్ర హెబ్బార్, 41, సిడ్నీ ఎయిర్ పోర్టులో స్క్రీనింగ్ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. భారత్‌లో ఎన్నికల సందర్భంగా సెలవు పెట్టుకుని స్వగ్రామమైన సూరత్కాల్‌కి చేరుకున్నాడు. అప్పటికీ ఎన్నికలు పూర్తి కాలేదు. కానీ, ప్రత్యేక దినాలు కావడంతో ఎయిర్ పోర్టులో రద్దీ పెరిగింది. సెలవు పొడిగించడానికి వేరే దారిలేదు. ఆ పరిస్థితుల్లో ఓటేయాలనే ఒకే ఒక్క ఉద్దేశ్యంతో జాబ్ వదిలేశాడు. 

‘నేను ఏప్రిల్ 5 నుంచి ఏప్రిల్ 12 వరకూ సెలవుపై ఇంటికి వచ్చాను. ఈస్టర్, రంజాన్‌ల కారణంగా ఎయిర్ పోర్టులో రద్దీ పెరిగింది. కానీ, నేను ఓటు వేయాలనే గట్టిగా నిర్ణయించుకున్నాను. సెలవును పొడిగించమని అడుగుదామని వెళ్లిన నేను.. ఉద్యోగానికి రాజీనామా ఇచ్చేసి రిటర్న్ ఫ్లైట్ ఎక్కి వచ్చేశాను’ అని మోడీ వీరాభిమాని అయిన సుధీంద్ర వెల్లడించాడు. 

ఇంకా మాట్లాడుతూ… ‘సిడ్నీలో పనిచేస్తున్నప్పుడు ప్రపంచ వ్యాప్తంగా యూరోపియన్లు, పాకిస్తానీలు ఇలా పలు దేశాల వారు.. భారత్ గురించి పొగిడేవారు. ఆ క్షణం నాకెంతో గర్వంగా అనిపించేది. ఈ ఘనతంతా భారత ప్రధాని నరేంద్ర మోడీదే. దేశ సరిహద్దులకు వెళ్లి పుట్టిన నేలకు సేవ చేయకపోయినా.. నా ఓటు హక్కు వినియోగించుకుని మోడీకి ఓటేస్తాను. జాబ్ ఇది కాకపోతే వేరే ఎక్కడ అయినా వెతుక్కుంటాను’ అని తన అభిమానాన్ని చాటుకున్నాడు సుధీంద్ర. 

ఇంత సులువుగా వదిలేయడానికి కారణమేంటో తెలుసా.. అతని భార్య ఓ ఆస్ట్రేలియన్. ఈ ఉద్యోగం పోతే ఇంకొక్కటి వెతుక్కునేందుకు అతనికి అక్కడ గ్రీన్ కార్డు ఉంది.