Telangana Govt : రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాలకు కొత్త హంగులు.. జాబితాలో 10 పుణ్యక్షేత్రాలు

తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రధాన ఆధ్యాత్మిక క్షేత్రాల అభివృద్ధిపై దృష్టిసారించింది. ఇందులో భాగంగా..

Telangana Govt : రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాలకు కొత్త హంగులు.. జాబితాలో 10 పుణ్యక్షేత్రాలు

Bhadrachalam Temple

Updated On : September 1, 2025 / 9:12 AM IST

Telangana Govt : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రధాన ఆధ్యాత్మిక క్షేత్రాల అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టిసారించింది. భవిష్యత్తులో పెరగనున్న భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆలయాల అభివృద్ధికి బృహత్ ప్రణాళిక (మాస్టర్ ప్లాన్)లను రూపొందిస్తుంది. ఇందులో బాసర, భద్రాచలం, జోగులాంబ సహా పలు ప్రధాన దేవాలయాలు ఉన్నాయి.

Also Read: Kaleshwaram Project : తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం.. సీబీఐకి కాళేశ్వరం ప్రాజెక్టు కేసు

రాష్ట్రంలోని ప్రధాన ఆలయాలకు వచ్చే భక్తుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ముఖ్యంగా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి వచ్చాక ఆలయాలకు భక్తులు పోటెత్తుతున్నారు. దీంతో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని, వారికి మెరుగైన సౌకర్యాలు కల్పించడంతోపాటు.. ఆలయాలను అన్నివిధాల అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆదేశాల మేరకు దేవాదాయ శాఖ డైరెక్టర్ వెంకట్ రావు ఆలయాల అభివృద్ధికి మాస్టర్ ప్లాన్లు రూపొందిస్తున్నారు.

బాసర, భద్రాచలం, జోగులాంబ సహా ఎనిమిది ప్రధాన దేవాలయాల అభివృద్ధికి రూ.2,202.35 కోట్ల వ్యయం అవుతుందని దేవాదాయ శాఖ అంచనా వేసింది. వేములవాడలోని రాజరాజేశ్వరస్వామి దేవస్థానం అభివృద్ధికి రూ. 696.25 కోట్లు, భద్రాచలంలోని సీతారామచంద్రస్వామి దేవస్థానం అభివృద్ధికి రూ. 350 కోట్లు, అలంపూర్ లోని జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి దేవస్థానంకు రూ.345 కోట్లు, కీసరలోని రామలింగేశ్వర స్వామి ఆలయంకు రూ. 202 కోట్లు, కాళేశ్వరంలోని కాళేశ్వర ముక్తేశ్వరస్వామి ఆలయంకు రూ. 200 కోట్లు, బాసరలోని జ్ఞానసరస్వతి దేవస్థానంకు రూ. 189.10 కోట్లు, కొడంగల్ లోని వేంకటేశ్వర స్వామి ఆలయంకు రూ. 110 కోట్లు, చెర్వుగట్టులోని పార్వతి జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానం అభివృద్ధికి రూ.110 కోట్లు అవుతాయని అంచనా వేశారు. లక్ష్మీనర్సింహస్వామి దేవస్థానం(ధర్మపురి), సమ్మక్క సారలమ్మ(మేడారం) ఆలయాలకు అంచనా వ్యయంపై స్పష్టత రావాల్సి ఉంది.

ఈ నిధుల ద్వారా ఆలయాల వద్ద రహదారుల విస్తరణ, ఉద్యానవనాలు, ట్రాఫిక్ నిర్వహణ, అన్నదాన కేంద్రాలు, అగ్నిమాపక సేవలు, క్యూలైన్ కాంప్లెక్స్, బ్రహ్మోత్సవాలలో సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు వసతులు వంటి సౌకర్యాలను కల్పిస్తారు. అయితే, వేములవాడ రాజరాజేశ్వరస్వామి దేవస్థానం అభివృద్ధికి రూ.696.25 కోట్లతో రూపొందించిన మాస్టర్ ప్లాను కు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. మొత్తం నాలుగు దశల్లో ఈ దేవస్థానాన్ని అభివృద్ధి చేయనున్నారు.

బాసరలోని జ్ఞాన సరస్వతి దేవస్థానాన్ని రూ.189.10 కోట్లతో నాలుగు దశల్లో అభివృద్ధి చేసేలా ప్రణాళికలు రూపొందించారు. అయితే, ఇందుకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమోదం కోసం పంపించారు. సీఎం ఆమోదం తరువాత కార్యాచరణ మొదలవుతుందని ఆలయ అధికారులు పేర్కొన్నారు. భద్రాచలంలోని సీతారామచంద్రస్వామి దేవస్థానాన్ని రూ.350 కోట్లతో మూడు దశల్లో అభివృద్ధి చేయనున్నారు. ఇప్పటికే క్షేత్ర స్థాయి పరిశీలన పూర్తయింది. కలెక్టర్ నుంచి ప్రతిపాదనలు రావాల్సి ఉంది. అయితే, మిగిలిన దేవాలయాలకు మాస్టర్ ప్లాన్లు సిద్ధం అవుతున్నాయి.