Heavy Rains : రెయిన్ అలర్ట్.. ఈ నెలలోనూ దంచికొట్టనున్న వానలు.. అప్రమత్తంగా ఉండాలంటూ ఐఎండీ హెచ్చరికలు
Heavy Rains : సెప్టెంబర్ నెల నుంచి నైరుతి రుతుపవనాలు ప్రారంభమవుతున్న తరుణంలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ అంచనా వేసింది.

Rain Alert
Heavy Rains : ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా ఆగస్టు నెలలో వర్షాలు దంచికొట్టాయి. దీంతో నదులు, వాగులు పొంగిప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే, ప్రస్తుతం వర్షాలు కాస్త తెరిపినివ్వడంతో ముంపు ప్రాంతాల్లోని ప్రజలు ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో భారత వాతావరణ శాఖ (ఐఎండీ) కీలక హెచ్చరికలు జారీ చేసింది. సెప్టెంబర్ నెలలో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది.
Also Read : AP Rains : ఏపీలో మూడ్రోజులు వానలే వానలు.. నేడు ఈ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు..
సెప్టెంబర్ నెల నుంచి నైరుతి రుతుపవనాలు ప్రారంభమవుతున్న తరుణంలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ అంచనా వేసింది. ముఖ్యంగా ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో కొండచరియలు విరిగిపడటం, బుదర జాలువారడం వంటి ప్రమాదాలు సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఐఎండీ హెచ్చరించింది.
సెప్టెంబర్ నెలలో నెలవారీ సగటు వర్షపాతం దీర్ఘకాలిక సగటు 167.9 మి.మీ.లో 109శాతం కంటే ఎక్కువగా ఉంటుందని ఐఎండీ అంచనా వేసింది. ఈ నెలలో ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, తూర్పు రాజస్థాన్ అంతటా భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని, దక్షిణ హర్యానా, ఢిల్లీ, ఉత్తర రాజస్థాన్ లలో సాధారణ జీనజీవనానికి అంతరాయం కలిగే అవకాశం ఉందని ఐఎండీ డైరెక్టర్ వెల్లడించారు. తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోనూ సెప్టెంబర్ నెలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది.
వాయవ్య భారతదేశంలో ఆగస్టు నెలలో 265 మి.మీ వర్షపాతం నమోదైంది. అయితే, 2001 తర్వాత అత్యధిక వర్షపాతం ఈ ఆగస్టు నెలలోనే నమోదైంది. 1901 తర్వాత ఇది 13వ అత్యధికం అని ఐఎండీ తెలిపింది. ఆగస్టులో దేశం మొత్తం మీద 268.1 మి.మీ వర్షపాతం నమోదైంది. ఇది సాధారణం కంటే దాదాపు 5శాతం ఎక్కువ. జూన్ నుండి ఆగస్టు వరకు మూడు నెలల్లో 743.1 మి.మీ వర్షపాతం నమోదైంది. ఇది సాధారణం కంటే దాదాపు 6శాతం ఎక్కువ. ఇక సెప్టెంబర్ నెలలోనూ దేశంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది.