AP Rains : ఏపీలో మూడ్రోజులు వానలే వానలు.. నేడు ఈ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు..
AP Rains : ఏపీలోని పలు జిల్లాల్లో వచ్చే మూడు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.

AP Rains
AP Rains : ఏపీలో వర్షాలు దంచికొడుతున్నాయి. అయితే, వచ్చే మూడు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. తీరంవెంబడి గంటకు 40 నుంచి 60 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.
Also Read: త్రిశూల వ్యూహాన్ని తన సొంత నియోజకవర్గం పిఠాపురం నుంచి మొదలుపెట్టిన పవన్
పశ్చిమ బెంగాల్-ఒడిశా తీరాలకు ఆనుకుని వాయువ్య బంగాళాఖాతం మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని, రేపటిలోపు వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, దీని ప్రభావంతో ఏపీలో రాబోయే మూడు రోజులు పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు.. కొన్ని ప్రాంతాల్లో అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.
సోమవారం శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు మన్యం, విశాఖపట్టణం, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, అదేవిధంగా.. కోనసీమ, తూర్పు, పశ్చిమ గోదావరి, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
తీరం వెంబడి గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని, గురువారం వరకు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని ప్రఖర్ జైన్ వెల్లడించారు. భారీ వర్షాల నేపథ్యంలో ఇప్పటికే ప్రభావిత జిల్లాల అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్లు తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
వర్షాలు పడే సమయంలో, ఈదరుగాలులు సమయంలో ప్రజలు చెట్ల కింద, శిథిలావస్థలో ఉన్న భవనాలు, హోర్డింగ్స్ వద్ద ఉండరాదని, అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు.