CJI BR Gavai: దాడికి యత్నం ఘటనపై స్పందించిన సీజేఐ బీఆర్ గవాయ్.. కీలక వ్యాఖ్యలు..
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్‌పై సుప్రీంకోర్టులో దాడికి యత్నించిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే.

CJI BR Gavai: తనపై న్యాయవాది దాడికి యత్నించిన ఘటనపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ స్పందించారు. కీలక వ్యాఖ్యలు చేశారాయన. కేసు విచారణ సందర్భంగా జరిగిన ఘటనపై నేడు సీజేఐ గవాయ్ ఆ ఘటన ప్రస్తావన తెచ్చారు. సోమవారం నాటి ఘటనతో నేను, నా సహచర జడ్జి షాక్‌కి గురయ్యామని తెలిపారు.
మా వరకు అది మర్చిపోయిన అధ్యాయం అని వ్యాఖ్యానించారు. కాగా, సీజేఐపై దాడిని జోక్‌గా తీసుకోకూడదని మరో న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ అన్నారు. బూటు దాడి ఘటన సుప్రీంకోర్టును అవమానించడమే అని, బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిందే అని ఆయన పేర్కొన్నారు. సీజేఐపై దాడికి యత్నం ఘటన క్షమార్హం కాదని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అన్నారు. అది మర్చిపోయిన అధ్యాయం అనడం సీజేఐ గొప్పదనం అని కొనియాడారు.
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్‌పై సుప్రీంకోర్టులో దాడికి యత్నించిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. దీన్ని రాజకీయ పార్టీలు ముక్త కంఠంతో ఖండించాయి.
అక్టోబరు 6న ఈ ఘటన జరిగింది. సీజేఐ జస్టిస్ గవాయ్, జస్టిస్ వినోద్ చంద్రన్‌తో కూడిన ధర్మాసనం కోర్టు నెం1లో పిటిషన్లపై విచారణను కొనసాగిస్తుండగా రాకేశ్ కిశోర్ (71) అనే న్యాయవాది వేదిక వద్దకు వచ్చారు. వెంటనే తన కాలికి ఉన్న బూటును తీసి విసరబోతుండగా భదత్రా సిబ్బంది అడ్డుకున్నారు. అక్కడి నుంచి ఆయనను బయటకు తీసుకెళ్లారు. ‘సనాతన ధర్మాన్ని అవమానిస్తే సహించేది లేదు’ అంటూ ఆ న్యాయవాది నినాదాలు చేశారు. కాగా, ఇలాంటి బెదిరింపులు తన దృష్టిని మళ్లించ లేవని, తన పని తీరును ఎంతమాత్రమూ ప్రభావితం చేయలేవని కోర్టు హాల్ లో ఉన్న న్యాయవాదులతో సీజేఐ జస్టిస్ గవాయ్ అన్నారు.
Also Read: ఫోర్బ్స్ సంపన్నుల జాబితా.. దేశంలో అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ.. రెండో స్థానంలో ఎవరంటే..?