తెరుచుకున్న వైష్ణోదేవి ఆలయం..నిబంధనలతో భక్తులకు ప్రవేశం

దాదాపు ఐదు నెలల తరువాత వైష్ణోదేవి ఆలయం తెరుచుకుంది. కరోనా వైరస్ తెచ్చిన లాక్ డౌన్ తో ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం ప్రజల్ని ఇంటికే పరిమితం చేసింది. ఈ క్రమంలో అన్ని మతాలకు చెందిన ప్రార్థనా మందిరాలు మూసి ఉన్న విషయం తెలిసిందే. లాక్‌డౌన్ సడలింపుల్లో భాగంగా మూసి ఉన్న ఆలయాలు ఒక్కొక్కటిగా తెరుచుకుంటున్నాయి. అయితే తెరుచుకున్న ఆలయాల్లో కరోనా గుబులు రేపుతోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా, తెలుగు రాష్ట్రాల్లోనూ అర్చకులకు, సిబ్బందికి, భక్తులకు కరోనా సోకుతుండటంతో తెరిచిన ఆలయాలను మళ్లీ మూసివేస్తున్నారు.
ఈ క్రమంలో కరోనా కారణంగా మూసిఉన్న జమ్మూకశ్మీర్ లోని ప్రముఖ ప్రసిద్ది చెందిన వైష్ణోదేవీ దేవాలయం దాదాపు 5 నెలల తర్వాత తెరుచుకుంది. ఆదివారం నుంచి భక్తుల దర్శనానికి అనుమతించారు. మార్చి 18న కరోనా విజృంభిస్తున్న క్రమంలో ఆలయాన్ని మూసివేసిన విషయం తెలిసిందే.
భక్తులు, ఆలయ అర్చకులు..సిబ్బంది ఆరోగ్యాలను కూడా దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం కచ్చితమైన ప్రణాళిలను పాటిస్తోంది. ఈ సందర్భంగా శ్రీ మాతా వైష్ణోదేవి బోర్డు సీఈవో రమేష్ కుమార్ మాట్లాడుతూ..రెడ్ జోన్ నుంచి వచ్చే భక్తులు తప్పనిసరిగా కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని..నెగిటివ్ రిపోర్టు ఉంటేనే అమ్మవారి దేవాలయంలోకి ప్రవేశముంటుందని స్పష్టంచేశారు. అలాగే భక్తులంతా తప్పనిసరిగా మాస్కులు ధరించాలని సూచించారు. అలాగే వైష్ణోదేవి యాత్రకు వచ్చేవారంతా ‘ఆరోగ్య సేతు’యాప్ ఇన్ స్టాల్ చేసుకోవాలని కోరారు.
10ఏళ్లలోపు చిన్నారులు, 60 ఏళ్లు దాటినవారు, గర్భిణీలను దర్శనానికి అనుమతించబోమని తెలిపింది. ఆన్‌లైన్ ద్వారా భక్తులు పేర్లును నమోదుచేసుకోవాలి. అలాగే, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులు కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేసుకుని, నెగెటివ్ వచ్చినవారిని అనుమతిస్తామని స్పష్టం చేసింది.భవన్ కాంప్లెక్స్‌లోకి యాత్రికులు, ఆలయ, భద్రత సిబ్బంది 600 మంది మించకూడదని, ఆలయంలోనూ మూడు గజాల దూరం పాటించాలని సూచించారు.