Parliament Monsoon Session : జూలై 19 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు!
జూలై 19 నుంచి ఆగస్టు 13 వరకు పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరిగే అవకాశముంది.

Parliament
Parliament Monsoon Session జూలై 19 నుంచి ఆగస్టు 13 వరకు పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరిగే అవకాశముంది. పార్లమెంటరీ వ్యవహారాలపై ఏర్పాటైన కేబినెట్ కమిటీ ఈ మేరకు తేదీలు సిఫార్సు చేసింది. కరోనా నేపథ్యంలో కోవిడ్ ప్రవర్తనా నియమావళి ప్రకారం సభా వ్యవహారాలను సాగించనున్నారు. సుమారు నెల రోజుల పాటు సాగే సమావేశాల్లో 20 సిట్టింగ్స్ ఉండనున్నాయి. కనీసం ఒక డోసు కోవిడ్ టీకా తీసుకున్న వారిని పార్లమెంట్‌లోకి ఎంటరయ్యే అవకాశం కల్పించనున్నట్లు తెలుస్తోంది.
కాగా, సాధారణంగా జులైలో ప్రారంభం కావాల్సిన వర్షాకాలం సమావేశాలు గతేడాది కొవిడ్ కారణంగా సెప్టెంబర్‌లో ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే ఈసారి మాత్రం యథావిధిగా జులైలోనే జరుగుతాయని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ఇదివరకే ప్రకటించారు. కొవిడ్ వ్యాప్తి ప్రారంభమైనప్పటి నుంచి పార్లమెంటు సెషన్స్ కుదించినట్లు జోషి తెలిపారు. మహమ్మారి కారణంగా గతేడాది పార్లమెంటు శీతాకాలపు సమావేశాలు రద్దు చేసినట్లు గుర్తు చేశారు.