ధీర వనిత : అభినందన్ తల్లి ఎల్లలెరుగని ప్రాణదాత

ఆమె ఒక డాక్టర్.. అంతకు మించి ఆమె ఓ సంఘ సేవకురాలు. ఎల్లలు ఎరుగని మానవతా వాది. ఎవరికి ఏ కష్టమొచ్చినా ఆదుకోవడంలో ముందుంటుంది. బాంబు చప్పుళ్లకు, ఆత్మాహుతి దాడులకు బెదరని ధీర వనిత. యుద్ధ ప్రాంతాల్లోనూ క్షతగాత్రులకు వైద్యం అందించిన మానవతా మూర్తి. ఇంతకీ ఎవరామె…అభినందన్.. ప్రస్తుతం ప్రతి ఒక్కరి నోట్లో నానుతున్న పేరిది. శత్రు దేశంలో.. శత్రువుల ముందే ఎంతో ధైర్యంతో మాట్లాడి భారత సైన్యం ఎంత దృఢమైనదో ప్రపంచ దేశాలకు చాటి చెప్పాడు. అంతర్జాతీయ ఒత్తిడి, యుద్ధ భయంతో చివరికి పాకిస్థాన్ అభినందన్‌ను వెనక్కి పంపడానికి అంగీకరించింది. మార్చి 01వ తేదీ శుక్రవారం రాత్రి 9 గంటలకు అభినందన్ మాతృదేశానికి చేరుకున్నాడు.
అభినందన్ ఫ్యామీలో అందరూ హీరోలే. తాత, తండ్రి సింహకుట్టి, భార్య తన్వీ ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో పనిచేసిన వారే. అభినందన్ తండ్రి మాత్రమే కాదు తల్లి కూడా సమాజ సేవకురాలే. అభినందన్ తల్లి శోభ వైద్య నిపుణురాలు. అంతేకాదు.. ఓ గొప్ప వీరుడికి జన్మనిచ్చి దేశ సేవకోసం అంకితం చేశారామె. శోభా అలాంటి ఇలాంటి డాక్టర్ కాదు. బోర్డర్స్లో భాగమైన డాక్టర్ శోభ నిత్యం బాంబుల మోతతో దద్దరిల్లే యుద్ధ ప్రాంతాల్లో విధులు నిర్వర్తించి ఎంతోమందికి ప్రాణాలు పోశారు. 2005లో ఐవరీ కోస్ట్ వెళ్లిన శోభ.. అక్కడ ప్రాణాప్రాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న అనేక మందికి వైద్య సేవలందించి ప్రాణాలు పోశారు. ఆ తర్వాత లైబీరియాలోనూ చాలా మందికి ఊపిరులూదారు. పౌరయుద్ధం కారణంగా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్న సమయంలో ఆమె ఐక్యరాజ్యసమితి వాలంటీర్‌గా కూడా పని చేశారు.
నైజీరియాలోని పోర్ట్ హార్‌కోర్ట్‌లోనూ శోభ విధులు నిర్వర్తించారు. పోర్టబుల్ ఎమర్జెన్సీ సెక్షన్ ప్రారంభించి.. బ్లడ్‌బ్యాంక్, ఐసీయూ ఏర్పాటు చేశారు. మారుమూల ప్రాంతాలకు వెళ్లి… నిరుపేదలకు వైద్య సేవలు అందించారు. అంతేకాదు.. గల్ఫ్ యుద్ధ సమయంలో ఆత్మాహుతి బాంబు దాడుల నుంచి తప్పించుకొని ఇరాక్‌లోనూ విధులు నిర్వహించారు. ప్రపంచంలోని సంఘర్షణాత్మక ప్రాంతాల్లో ఎంతో ధైర్యంగా ఆమె సేవలు అందించారు. 2010లో హైతీలో సంభవించిన భూకంపంలో మూడు లక్షల మంది చనిపోయారు. వెంటనే అక్కడికి చేరుకున్న శోభ.. క్షతగాత్రులకు వైద్య చికిత్స అందించారు.
శోభ లేటెస్ట్‌గా లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా క్యాంపెయిన్ చేపట్టారు. లైంగిక వేధింపులకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలంటూ రెండు సంవత్సరాలుగా క్యాంపెయిన్‌ను ఆమె నిర్వహిస్తున్నారు. ఇలా డాక్టర్ శోభ… ఎక్కడ ఎవరికి కష్టమొచ్చిందన్నా స్పందించే మానవతా మూర్తి. ఎల్లులు ఎరుగని మానవతావాది ఆమె. మనసు నిండుగా సేవాభావం ఉన్న శోభకు జన్మించిన అభినందన్ ఇలా కాక ఎలా ఉంటాడు. తండ్రిలోని దేశభక్తి, ధైర్యం.., తల్లిలోని సేవాగుణాన్ని ఆయన పుణికి పుచ్చుకున్నాడు. అందుకే దేశం కోసం, దేశ ప్రజల కోసం పాటు పడుతున్నాడు. నిజాయితీ, అంకితభావం, మొక్కవోని ధైర్యం.. ఇవన్నీ కలగలపి అభినందన్‌గా తయారుచేసింది ఆ తల్లి. అందుకే అభినందన్ భరతమాత ముద్దుబిడ్డ అయ్యాడు.